Russia: రష్యా సైన్యం నుంచి 85 మంది భారతీయులకు విముక్తి

by S Gopi |
Russia: రష్యా సైన్యం నుంచి 85 మంది భారతీయులకు విముక్తి
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం జరుగుతున్న సమయంలో అనూహ్య పరిస్థితుల మధ్య కొందరు భారతీయులు మోసపూరితంగా రష్యా ఆర్మీలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రష్యా సైన్యం రిక్రూట్ చేసిన 85 మంది భారతీయులను విముక్తి కలిగించారు. మరో 20 మంది పౌరుల విడుదల కోసం అధికారులు కృషి చేస్తున్నారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రకటించారు. రష్యాలోని కజాన్ నగరంలో మంగళవారం జరిగిన బ్రిక్స్ సమ్మిట్ మార్జిన్‌లో జరిగే సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగే సమావేశంలో మిగిలిన భారతీయుల విడుదలపై స్పష్టత వస్తుందనే అంచనాలున్నాయి. రష్యన్ సైనిక విభాగాల్లో వంటవారు, సహాయకులుగా చేరిన భారతీయులను విడుదల చేయడం, స్వదేశానికి రప్పించడం కేంద్ర ప్రభుత్వానికి కీలక సమస్యగా మారింది. జూలైలో మాస్కోలో జరిగిన భారత్-రష్యా వార్షిక సదస్సు సందర్భంగా పుతిన్‌ను కలిసినప్పుడు మోడీ ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రస్తుత సమాచారం ప్రకారం, సుమారు 85 మంది రష్యా నుంచి తిరిగి వచ్చారు. అలాగే, యుద్ధ సమయంలో ప్రాణాలు కోల్పోయిన కొందరు వ్యక్తుల మృత దేహాలను కూడా తెచ్చామని మిస్రీ చెప్పారు. ఇంకా 20 మంది రష్యన్ ఆర్మీలో ఉన్నారని సమాచారం ఉంది. వారి విడుదల కోసం ఒత్తిడి చేస్తున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed