Tamilanadu: తమిళనాట మరోసారి తమిళం, ద్రవిడ, హిందీలపై రాజకీయ దుమారం

by S Gopi |
Tamilanadu: తమిళనాట మరోసారి తమిళం, ద్రవిడ, హిందీలపై రాజకీయ దుమారం
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు రాష్ట్రం మరోసారి భాష వ్యవహారంలో రాజకీయ చర్చకు కేంద్రమైంది. ఇటీవల తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి అధ్యక్షతన జరిగిన దూరదర్శన్ కార్యక్రమంలో రాష్ట్ర గీతం ఆలపించే సమయంలో ఉద్దేశపూర్వకంగా గవర్నర్ ద్రవిడ పదాన్ని పలకలేదని ప్రభుత్వం విమర్శించింది. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో మరోసారి తమిళ, ద్రవిడ చర్చ ముందుకొచ్చింది. ప్రధాన రాజకీయ పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకే, కాంగ్రెస్, వీసీకే, వామపక్షాలు రాష్ట్రంలో హిందీని బలవంతంగా రుద్దుతున్నారనే తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. దివంగత నటుడు విజయకాంత్‌కు చెందిన డీఎండీకే, బీజేపీ ఇందుకు భిన్నంగా విద్యార్థులే తమకు నచ్చిన భాషను ఎంచుకునేలా చూడాలని చెబుతున్నాయి. మరోవైపు తమిళ నేషనలిస్ట్ పార్టీ నామ్ తమిళర్ కచ్చి(ఎన్‌టీకే) తమిళ వర్సెస్ ద్రవిడ్ చర్చ ద్వారా మరింత వేగంగా ప్రజల్లో విస్తరించే ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల 2024 లోక్‌సభ ఎన్నికల్లో యువత మద్దతుతో ఈ పార్టీ 8 శాతం ఓట్లను సాధించింది. దీంతో ఎన్‌టీకే నేత సెంథమిలన్ సీమన్ తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర గీతాన్ని కొనసాగించబోనని చెప్పారు. ఒకప్పుడు పెరియార్‌ను గౌరవించిన సీమన్ ఇప్పుడు ద్రవిడ పార్టీలు, సిద్ధాంతాలపై జరిగే రాజకీయాలకు తనని తాను ప్రధాన వ్యక్తిగా చూపించాలని భావించిన ఆయన అనంతరం పంథా మార్చుకున్నారు.

1970వ దశకంలో తమిళ కవి మనోన్మణియం సుందరనార్ రాసిన పాటను ప్రకటించే సమయంలో అప్పటి ముఖ్యమంత్రి ఎం కరుణానిధి పాటలో ఆర్య భాషల గురించి కొన్ని భాగాలను తొలగించారు. దీనిపై 'మొత్తం పాటలో తమిళం ప్రస్తావన లేదు. మనం ద్రావిడులమని ఎప్పటికీ అంగీకరించము. మేం తమిళులం' అని సీమన్ అన్నారు. తమిళ జాతీయవాద ద్రవిడ పార్టీలు తమ తమిళ గుర్తింపును కోల్పోయాయని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి సోమవారం ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ద్రవిడ సిద్ధాంతానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు చేశారు.

తమిళనాడు రాష్ట్రం 1935, 1965లలో రెండుసర్లు హింసాత్మక హిందీ వ్యతిరేక ఆందోళనలను చూసింది. వాటి కారణంగా రాష్ట్రం హిందీని అంగీకరించే వరకు ఆంగ్లం అనుసంధాన భాషగా పనిచేస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించవలసి వచ్చింది. 1968లో డీఎంకే కాంగ్రెస్‌ను మట్టికరిపించి అధికారంలోకి వచ్చిన తర్వాత తమిళం, ఆంగ్లం రెండు భాషల ఫార్ములాను అనుసరిస్తామని అధికారికంగా ప్రకటించింది. బీజేపీ, డీఎండీకే వంటి పార్టీలు రెండు భాషల ఫార్ములాను వ్యతిరేకిస్తున్నప్పటికీ, హిందీతో సహా ఏ ఒక్క భాషనో రుద్దడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెబుతున్నాయి. తమిళనాడులో భాష ఇప్పటికీ కీలక అంశంగా ఉందని ఈ పార్టీలు గ్రహించాయి. రాష్ట్రంలో హిందీని స్పష్టంగా ఆమోదించకుండా వారు జాగ్రత్తగా వైఖరిని తీసుకుంటున్నారు.

Advertisement

Next Story