దిగొచ్చిన మమత సర్కార్.. నిరాహార దీక్ష విరమించిన జూడాలు

by saikumar |   ( Updated:2024-10-21 18:46:44.0  )
దిగొచ్చిన మమత సర్కార్.. నిరాహార దీక్ష విరమించిన జూడాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతా ఆర్జీకర్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ వైద్య సిబ్బంది ఎట్టకేలకు నిరహారదీక్షకు ముగింపు పలికారు. సోమవారం బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో వైద్య బృందం తమ డిమాండ్లపై చర్చలు జరిపింది. ఈ భేటీని లైవ్‌గా ప్రసారం చేశారు. తమ డిమాండ్లకు సీఎం మమతా బెనర్జీ తలొగ్గడంతో దీక్షను విరమిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. ఆర్జీ కర్ ఆస్పత్రిలో మెడికో వైద్య విద్యార్థినిపై రేప్ అండ్ మర్డర్ జరిగిన విషయం తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆస్పత్రి వైద్య సిబ్బంది ఘటన జరిగిన మరుసటి రోజు నుంచి నిరసన తెలుపుతూ వచ్చారు.

దీనికి తోడు నిరసనల్లో పాల్గొన్న వైద్యులపై ఆర్జీకర్ ఆస్పత్రి అధికారులు, హెల్త్ సెక్రటరీ బెదిరింపులకు పాల్పడటం చేశారు. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా పలువురు డాక్టర్లను సస్పెండ్ చేయడం వంటివి చేశారు. ఈ క్రమంలోనే బెదిరింపు కల్చర్‌ను సైతం వ్యతిరేకిస్తూ ఆర్జీకర్ ఆస్పత్రి జూడాలు ఈనెల 5న నిరాహార దీక్షకు పూనుకున్నారు. దీక్షలో భాగంగా ఆరోగ్యం క్షీణించడంతో ఆరుగురు వైద్యులు ఆస్పత్రి పాలయ్యారు. ఈ క్రమంలోనే దీక్ష విరమించాలని, డాక్టర్ల సమస్యలను మూడు నెలల్లో తీరుస్తామని దీదీ సర్కార్ ఎంత చెప్పినా వారు వినలేదు.

ఈ నిరసనలను మరింత ఉధృతం చేశారు. ప్రతిపక్షాల ఒత్తిడి మేరకు ఎట్టకేలకు వారి డిమాండ్లను తీర్చేందుకు మమతా సర్కార్ దిగిరావడంతో జూడాలు నిరాహార దీక్షను విరమించారు. అయితే, రేప్ అండ్ మర్డర్ కేసులో బాధితురాలికి న్యాయం.. అకారణంగా సస్పెండ్ చేసిన వారిని విధుల్లోకి తీసుకోవడం.. తమను ఉద్యోగ పరంగా బెదిరింపులకు గురిచేసిన ప్రభుత్వ హెల్త్ సెక్రటరీ నిగమ్‌ను విధుల నుంచి తప్పించాలనే డిమాండ్లను జూడాలు సీఎం మమతా బెనర్జీ ముందుంచారు. అందుకు దీదీ ఓకే చెప్పడంతో ఈ నిరసనల పర్వం సర్దుమణిగింది. కాగా, ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌ సందీప్ ఘోష్ను సీబీఐ అధికారులు ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే.




-

Advertisement

Next Story

Most Viewed