BJP: మేనిఫెస్టో రూపకల్పనకు వివిధ వర్గాల నుంచి సూచనలు కోరిన బీజేపీ

by S Gopi |
BJP: మేనిఫెస్టో రూపకల్పనకు వివిధ వర్గాల నుంచి సూచనలు కోరిన బీజేపీ
X

దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే నెలలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కీలక ప్రకటన చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచేందుకు వివిధ వర్గాల నుంచి సూచనలు ఇవ్వాలని ఆహ్వానించింది. మహారాష్ట్ర సమిష్టి, చైతన్యవంతమైన అభివృద్ధి ప్రణాళికను మేనిఫెస్టోలో చేర్చాలని బీజేపీ భావిస్తోంది. దీనికోసం సామాజిక కార్యకర్తలు, రైతులు, జర్నలిస్టులు, వైద్యులు, ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు, సాంకేతిక నిపుణులు, మహిళా కార్యకర్తలు తదితరులు తమ సూచనలను సమర్పించాలని పార్టీ విజ్ఞప్తి చేసినట్లు బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు సుధీర్ ముంగంటివార్ సోమవారం ప్రకటించారు. 'మీరు సమాజంలోని ఏదొక రంగంలో నిపుణులు. మీ అనుభవం, జ్ఞానం, నైపుణ్యం ద్వారా మహారాష్ట్రను అభివృద్ధి చేయడానికి సహకరిస్తారని మేము భావిస్తున్నాము' అని బీజేపీ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రపంచ వేదికపై భారత్‌కు గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించిపెట్టిన ప్రధాని మోడీ వివిధ రంగాలలో సాధించిన అద్భుతమైన విజయాలను, అందరినీ కలుపుకొని చైతన్యవంతమైన అభివృద్ధి కోసం ముసాయిదా ప్రణాళికను రూపొందించామని పార్టీ పేర్కొంది. ప్రజలు తమ సూచనలను పార్టీ సూచించిన ఈమెయిల్‌తో పాటు వాట్సాప్ నంబర్‌కు పంపవచ్చని స్పష్టం చేసింది. కాగా, మహాయుతి కూటమిలోని భాగస్వామ్యాల్లో ఒకటైన బీజేపీ తొలి జాబితాలో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర యూనిట్ చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే సహా 99 మంది అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed