Israel- Hamas war: ఇజ్రాయెల్ కు అండగా ఉండేందుకు ముందుకొచ్చిన అమెరికా

by Shamantha N |
Israel- Hamas war: ఇజ్రాయెల్ కు అండగా ఉండేందుకు ముందుకొచ్చిన అమెరికా
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధం విషయంలో హెజ్ బొల్లా, ఇరాన్ జోక్యం చేసుకుంది. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యకు ప్రతీకారంగా ఇరాన్, దాని మిత్ర దేశాలు ఇజ్రాయెల్ పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో ఐడీఎఫ్ అప్రమత్తమైంది. టెల్‌ అవీవ్‌కు అండగా ఉండేందుకు అమెరికా ముందుకొచ్చింది. పశ్చిమాసియాకు యుద్ధ నౌకలు, ఫైటర్‌ జెట్లను పంపిస్తోంది. రక్షణ సిబ్బందితో పాటు ఇజ్రాయెల్ కోసం అదనపు వార్ షిప్స్, ఫైటర్ జెట్లను అమెరికా పంపినట్లు వార్తలొస్తున్నాయి. వీటితో పాటు బాలిస్టిక్‌ క్షిపణి సామర్థ్యం కలిగిన అదనపు క్రూజర్లు, డిస్ట్రాయర్లను కూడా పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

వరుస దాడులతో..

హమాస్‌ చీఫ్ హనియా హత్య జరిగింది. హమాస్ సైనికాధిపతి మహ్మద్ డెయిఫ్ ను ఇజ్రాయెల్ హతమార్చింది. అలానే, లెబనాన్ లో హెజ్ బొల్లా సీనియర్ మిలిటరీ కమాండర్ షాద్ శుక్ర కూడా ఇజ్రాయిల్ దాడిలో చనిపోయాడు. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితుల తీవ్రమయ్యాయి. ఇప్పటికే ఇజ్రాయెల్‌ భూభాగం వైపునకు లెబనాన్‌ పలు రాకెట్లను ప్రయోగించింది. మరోవైపు, హనియా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడికి ఇరాన్ అగ్రనేత అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇలాంటి సమయంలో అమెరికా దళాలు ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలిచాయి.

Advertisement

Next Story