Waqf Board: 1200 ఎకరాలు కాదు.. 11 ఎకరాలే

by Mahesh Kanagandla |
Waqf Board: 1200 ఎకరాలు కాదు.. 11 ఎకరాలే
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక(Karnataka)లో మరోసారి వక్ఫ్(Waqf) చుట్టూ వివాదం రేగింది. విజయపురా(Vijayapur) జిల్లాలోని 1200 ఎకరాలు వక్ఫ్ భూములేనని(Waqf lands), వాటిని రైతులు తిరిగి వక్ఫ్‌కు అప్పగించాలని రైతులకు నోటీసులు వచ్చాయి. స్థానిక తహశీల్దార్ అక్టోబర్ 4వ తేదీన ఈ నోటీసులు పంపారు. దీంతో రైతులు భగ్గుమన్నారు. తాము తరతరాలుగా ఈ భూమిలో సాగు చేసుకుంటున్నామని, ఇప్పుడు ఉన్నపళంగా ఆ భూములన్నీ వక్ఫ్‌కు చెందిన ఆస్తులని రెవెన్యూ శాఖ చెప్పడంపై ఆగ్రహించారు. ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష బీజేపీ వారికి మద్దతునిస్తూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర కేబినెట్ మంత్రి ఎంబీ పాటిల్ శనివారం స్పష్టత ఇచ్చారు. వక్ఫ్ భూములు 1200 ఎకరాలు కాదని, కేవలం 11 ఎకరాలేనని చెప్పారు. 1974లో వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌లోనే పొరపాటు ఉన్నదని వివరించారు.

1200 ఎకరాల్లో 11 ఎకరాలు మాత్రమే వక్ఫ్ ఆస్తి అని, అందులో పది ఎకరాల స్మశాన వాటిక ఉంటే, 14 గుంటల్లో ఈద్గా, మసీదు, మిగిలిన 24 గుంటల్లో ఇతర నిర్మాణాలు ఉన్నాయని మంత్రి ఎంబీ పాటిల్ వివరించారు. ఈ 12 ఎకరాలు మినహా మిగిలిన భూమి అంతా రైతులదేనని, ఈ విషయాన్ని స్థానిక తహశీల్దార్, జిల్లా కమిషనర్ కూడా ధ్రువీకరించారని తెలిపారు. రైతులు ఈ విషయాన్ని తన దృష్టికి తేగానే తాను అక్టోబర్ 19వ తేదీన జిల్లా కమిషనర్, తహశీల్దార్, ఇతర అధికారులతో సమావేశమై.. సమస్యను సమగ్రంగా పరిశీలించి సరైన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. విజయపుర జిల్లాలో వక్ఫ్ ఆస్తులపై 1974, 1978, 2016లలో గెజిట్‌లు జారీ అయ్యాయని, ఇందులో 1974లో జారీ చేసిన గెజిట్‌లో మహల్‌బగాయట తర్వాత బ్రాకెట్‌లో హోనవాడను తప్పుగా చేర్చారని మంత్రి వివరించారు. ఈ తప్పును 1977 గెజిట్ సరిచేసిందని తెలిపారు. రైతులు తమ భూములను కోల్పోయే ఛాన్సేలేదని, కేవలం వక్ఫ్ ఆస్తులు మాత్రమే వారికి అప్పగిస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా, 1500 ఎకరాలను వక్ఫ్ తమదని క్లెయిమ్ చేసుకుంటున్నదని, కర్ణాటక వక్ఫ్ మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ హోనవాడ గ్రామ భూములను వక్ఫ్ బోర్డుకు 15 రోజుల్లో కట్టబెట్టాలని అధికారులను ఆదేశించారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ ఆరోపణలు ఖండించిన ప్రభుత్వం రైతుల భూములకు నష్టమేమీ లేదని స్పష్టం చేసింది.

Advertisement

Next Story