పాలు ఇస్తలేవు.. ప్రాణాలు ఇడుస్తున్నాయ్..

by Sumithra |
పాలు ఇస్తలేవు.. ప్రాణాలు ఇడుస్తున్నాయ్..
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : ఎస్సీ కార్పొరేషన్ గేదెల పథకం అమలులో జిల్లాలో భారీ అవినీతి జరిగినట్లు తెలుస్తుంది. సరఫరాదారులతో ఎస్సీ కార్పొరేషన్, పశు సంవర్ధక శాఖ అధికారులు కుమ్మకై అడ్డంగా దోచుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. సరఫరాదారులు ఇచ్చే తాయిలాలకు ఆశపడి లబ్ధిదారులకు నాసిరకం గేదెలను ఇప్పించారనే ఆరోపణలు వెల్లుతున్నాయి. లబ్ధిదారులకు పంపిణీ చేసిన గేదెల్లో కొన్ని గేదెలు పాలు ఇవ్వక.. మరికొన్ని ప్రాణాలు విడుస్తుండటంతో లబ్దిదారుల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. ఎస్సీ కార్పొరేషన్ గేదెల పథకంలో జిల్లాకు 618 యూనిట్లు మంజూరు అయ్యాయి. యూనిట్ విలువ రూ.2 లక్షలు. ఇందులో రూ.1,40 వేలు సబ్సిడీ పోను, రూ.60 వేలు రుణం. ఒక్క యూనిట్ కింద ఒక్క లబ్దిదారుడికి రెండు గేదెలు ఇప్పించాలి. ఎస్సీ కార్పొరేషన్, పశు సంవర్ధక శాఖ అధికారుల పర్యవేక్షణలో పాల దిగుబడి, గేదె ఆరోగ్య పరిస్థితి, మొదటి, రెండవ ఈత సంకర జాతి మొర్ర గేదెలను మాత్రమే లబ్దిదారులకు ఇప్పించాల్సి ఉంటుంది. రెండు రోజుల పాటు గేదె పాల దిగుబడి, ఆరోగ్య పరిస్థితి ఆధారంగా ధర నిర్ణయించాలి. యూనిట్ ధరలో సుమారు రూ. 50 వేల వరకు దాన, మందులు, రవాణా, ఇన్సూరెన్స్ కోసం వినియోగించాల్సి ఉంటుంది.

అధికారుల లాలూచీ..?

గతంలో జిల్లాలో విధులు నిర్వహించిన ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారి, పశుసంవర్ధక శాఖలో కొందరు అధికారులు సరఫరా దారులతో కుమ్మక్కు అయి నాసిరకం గేదెలను లబ్ధిదారులకు ఇప్పించారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 265 యూనిట్లు పంపిణీ జరిగాయి. పంపిణీ జరిగిన మొత్తం యూనిట్లు తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒకే సరఫరాదారుడి వద్ద కొనుగోలు చేయడం, ఒక్క గేదెకు రూ.75 వేల చొప్పున అన్ని గేదెలకు ఒకే ధర చెల్లించడం గమనార్హం. దీనికి తోడు ఎక్కవగా సూడి గేదెలే తీసుకొచ్చారని ఆరోపణలు ఉన్నాయి.

అగమ్య గోచరంలో లబ్ధిదారులు..

నాసిరకం పాడి గేదెలతో లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రోజుకు సుమారు 7 నుంచి 10 లీటర్ల పాల దిగుబడి ఇవ్వాల్సిన గేదెలు 3 నుంచి 4 లీటర్ల పాల దిగుబడి ఇస్తుండటం, కొన్ని గేదెలు మృత్యువాత పడుతుండటంతో లబ్ధిదారులు లబోదిబో అంటున్నారు.

ఉన్నతాధికారులు దృష్టి సారిస్తేనే..

ఎస్సీ కార్పొరేషన్ గేదెల పంపిణీ పథకంలో జిల్లాలకు మంజూరైన యూనిట్లలో లబ్ధిదారులకు పంపిణీ చేసిన యూనిట్లు పోగా మరో 315 యూనిట్లు పంపిణీ చేయాల్సి ఉంది. ఇందులో 215 యూనిట్లు గ్రౌండింగ్ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నాణ్యమైన గేదెలను లబ్ధిదారులకు పంపిణీ జరిగే విధంగా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని లబ్ధిదారుల డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed