నెమళ్లగుట్టలో వెలసిన ‘సమ్మక్క-సారక్క’

by Maddikunta Saikiran |
నెమళ్లగుట్టలో వెలసిన ‘సమ్మక్క-సారక్క’
X

దిశ, మంగపేట: మంగపేట మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో బుచ్చంపేట పంచాయతీ చెరుపల్లి రెవెన్యూలోని నెమళ్లగుట్టలో గిరిజన దేవతలైన సమ్మక్క-సారక్కల ఆలయం వెలుగులోకి వచ్చింది. జబ్బోనిగూడెంకు సమీపంలోని నెమళ్లగుట్టపై సమ్మక్క-సారక్క, నాగదేవత ఉప ఆలయాలు నిర్మించి పదేళ్లుగా రెండేళ్లకోసారి జాతర నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన పూజారి దేవర బాలకుంట్ల నరేష్ స్వామి తెలిపారు. నెమళ్ల గుట్టకు ఆనుకుని ఉన్న గౌరారం వాగు, సూరిపెల్లి గుట్టలతో పాటు పచ్చని అటవీ ప్రాంతం ఉండడంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ప్రతి గురు, ఆదివారాల్లో వచ్చే భక్తులు గిరిజన దేవతలకు పూజలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మేకలు, కోళ్లను బలిచ్చి కుటుంబ సమేతంగా విందు వినోదాలు చేసుకుంటున్నారు. సూరిపెల్లి గుట్టలు ఉండడంతో అక్కడి వచ్చే భక్తులు గుట్టలపై ట్రెక్కింగ్ చేస్తూ, గౌరారం వాగులో ఈతలు కొడుతూ రోజంతా ఎంజాయ్ చేస్తున్నారు. సమ్మక్క-సారక్క దేవతలతో పాటు పగిడిద్దరాజు, నాగదేవతలకు ఉప ఆలయాలు నిర్మించి నిత్యం పూజలు చేస్తున్నట్లు దేవర బాల, ప్రధాన పూజారి కుంట్ల నరేష్ తెలిపారు. తెలంగాణలోని హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్లగొండ, సూర్యాపేటతో పాటు ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ, చిల్లకల్లు చుట్టుపక్కల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నట్లు నరేష్ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం మండలంలోని నర్సాపురం బోరు ప్రధాన రహదారి నుంచి జబ్బోనిగూడెం వరకు బీటీ రోడ్డు సౌకర్యం ఉన్నప్పటికీ జబ్బోనిగూడెం నుంచి నెళ్లగుట్ట వరకు సుమారు మూడు కిలోమీటర్ల వరకు మట్టి రోడ్డు ఉండడంతో భక్తులు రాక పోకలకు ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సీతక్క నెమళ్ల గుట్ట సమ్మక్క-సారక్కల ఆలయాలను దర్శించి రోడ్డు సౌకర్యం కల్పించాలని భక్తులు, మండల ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed