Tata: వడోదరలో సైనిక విమానాల తయారీ హబ్.. రేపు ప్రారంభించనున్న ప్రధాని మోడీ

by Hajipasha |
Tata: వడోదరలో సైనిక విమానాల తయారీ హబ్.. రేపు ప్రారంభించనున్న ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో : సైనికపరమైన రవాణా అవసరాలకు వినియోగించే విమానాల తయారీకి సంబంధించిన దేశంలోనే తొలి యూనిట్ గుజరాత్‌లోని వడోదర(Vadodara)లో కార్యకలాపాలు ప్రారంభించబోతోంది. దీన్ని ఈనెల 28న (సోమవారం) భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ(PM Modi), స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ సంయుక్తంగా ప్రారంభించనున్నారు. స్పెయిన్‌కు చెందిన ఏరోస్పేస్ కంపెనీ ‘సీఏఎస్ఏ’, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) కలిసి వడోదర యూనిట్‌లో ‘సీ-295’ మోడల్‌ సైనిక విమానాలను తయారు చేయనున్నాయి.

స్పెయిన్ కంపెనీ ‘సీఏఎస్ఏ’లో మెజారిటీ వాటాలను ప్రముఖ విమానాల తయారీ కంపెనీ ‘ఎయిర్ బస్’ గతంలోనే కొనుగోలు చేసింది. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్(Tata), ఎయిర్ బస్ కలిసి సైనిక విమానాల తయారీ కోసం వడోదరలో ‘ఫైనల్ అసెంబ్లీ లైన్’ను ఏర్పాటు చేశాయి. ఇప్పుడు ఇందులోనే సీ-295 విమానాలను సైతం తయారు చేయబోతున్నారు. సీ-295 ప్రాజెక్టులో భాగంగా 16 సైనిక విమానాలను స్పెయిన్‌లోని ఎయిర్ బస్ ప్లాంటు నుంచి నేరుగా భారత్‌కు అందజేస్తారు. మిగతా 40 సైనిక విమానాలను వడోదరలోని ప్లాంటులో తయారు చేస్తారు. ఈ విమానాల అసెంబ్లింగ్, టెస్టింగ్, డెలివరీ, మెయింటెనెన్స్ వంటి పనులన్నీ స్థానికంగానే జరుగుతాయి.

Advertisement

Next Story