Kaleshwaram Commission: గుడ్డిగా సంతకం పెట్టడానికి రబ్బర్ స్టాంపువా?

by Gantepaka Srikanth |
Kaleshwaram Commission: గుడ్డిగా సంతకం పెట్టడానికి రబ్బర్ స్టాంపువా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం టెండర్ల ప్రక్రియపై జస్టిస్ ఘోష్(Justice Ghosh) లేవనెత్తిన ప్రశ్నలకు రామగుండం చీఫ్ ఇంజినీర్ సుధాకర్‌రెడ్డి(Ramagundam Chief Engineer Sudhakar Reddy) నీళ్ళు నమిలారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పనులు పూర్తి స్థాయిలో కంప్లీట్ కాకుండానే సబ్‌స్టాన్షియల్ సర్టిఫికెట్ జారీ చేయడంపై జస్టిస్ ఘోష్(Justice Ghosh) ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు పూర్తయ్యాయో లేదే ఫీల్డ్ స్టడీ చేయకుండానే సంతకం పెట్టినప్పుడు మతి ఉండే ఆ పని చేశారా?.. లేక సోయి తప్పి చేశారా?.. కేవలం రబ్బర్ స్టాంపు డ్యూటీకే పరిమితమయ్యారా?.. అంటూ మండిపడ్డారు. నిర్మాణ సంస్థకు, ఇరిగేషన్ డిపార్టుమెంటుకు మధ్య కుదిరిన ఒప్పందంలో ఇలాంటి నిబంధన లేకుండానే గుడ్డిగా సంతకం ఎలా పెట్టారని నిలదీశారు. బ్యారేజీ ఆపరేషన్‌లోకి వచ్చినందువల్లనే తాను ఫీల్డ్ స్టడీ చేయలేదని, ఇన్‌స్పెక్షన్ కూడా చేయలేదని చీఫ్ ఇంజినీర్ బదులిచ్చారు. బ్యారేజీ పనులు పూర్తయినట్లు సబ్‌స్టాన్షియల్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఏ సమయంలో ఇస్తారని కమిషన్ ప్రశ్నించగా, దాదాపు 90% పనులు పూర్తయితే ఇవ్వొచ్చని, బ్యారేజ్ వినియోగంలోకి వచ్చిందనుకున్నప్పుడు ఇవ్వొచ్చని రిప్లై ఇచ్చారు. ఏజెన్సీలకు అగ్రిమెంట్‌కంటే ఎక్కువ మొత్తంలో చెల్లించడంతో ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం జరిగినట్లు పరోక్షంగా అంగీకరించారు.

ఇవేవీ రికార్డుల్లో లేవని, వర్క్స్ చెక్ లిస్టును కూడా పరిశీలించలేదన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(Executive Engineer) ఆ సర్టిఫికెట్ ఇచ్చే అథారిటీ అని, కానీ తాను ఆ సర్టిఫికెట్‌పై కౌంటర్ సైన్ మాత్రమే చేశానని ఇచ్చిన వివరణతో జస్టిస్ ఘోష్ సంతృప్తి చెందలేదు. సంతకం చేసే ముందు తనిఖీలు చేసే బాధ్యత లేదా?.. అగ్రిమెంట్‌లోని 42 (2)(బి) ప్రకారం రిజెక్టు చేసే వెసులుబాటు ఉన్నా ఎందుకు ఆ అధికారాన్ని ఉపయోగించలేదు?.. వాస్తవాలను చూడకుండా గుడ్డిగా సంతకాలు పెట్టేస్తారా?... వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు విషయంలో చీఫ్ ఇంజినీర్‌గా మీ బాధ్యతలేంటో గుర్తించారా?.. అంటూ ప్రశ్నలవర్షం కురిపించారు. బ్యారేజీలో తాత్కాలిక అవసరాల కోసం నిర్మించిన కాఫర్ డ్యామ్ కోసం చేసే ఖర్చును ఒప్పందం ప్రకారం నిర్మాణ సంస్థలు భరించాల్సి ఉన్నా ప్రభుత్వం ఎందుకు నిధులు రిలీజ్ చేయాల్సి వచ్చిందని జస్టిస్ ఘోష్ ప్రశ్నించారు. నాలాలు, చెరువులు, కుంటలు, వాగుల విషయంలో మాత్రమే నిర్మాణ సంస్థలు భరిస్తాయని, జీవనదిపైన కట్టే బ్యారేజీల విషయంలో వర్తించదని, అందుకే ప్రభుత్వం భరించిందని వివరణ ఇచ్చారు. ఎవరి ఆదేశాలు ఉన్నాయని ప్రశ్నించగా, ఇన్‌స్పెక్షన్ కోసం అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు వచ్చినప్పుడు చీఫ్ ఇంజినీర్‌కు ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు.

బ్యారేజీల డీపీఆర్ తయారీకి ముందు చేయాల్సిన పరీక్షల గురించి జస్టిస్ ఘోష్ ప్రశ్నిస్తూ, ఈ ప్రక్రియ కోసం టెండర్లను పిలిచారా అని చీఫ్ ఇంజినీర్ నుంచి వివరణ తీసుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయంలో భాగంగా నామినేటెడ్ పద్ధతిలో వ్యాప్కోస్ సంస్థకు కట్టబెట్టిందన్నారు. డీపీఆర్ తయారీ ప్రక్రియలో ఫీల్డ్ స్టడీ రిపోర్టులను వ్యాప్కోస్ పరిగణనలోకి తీసుకున్నదా అని ప్రవ్నించగా, అప్పటి మంత్రి హరీశ్‌రావు ఆదేశం మేరకు రిపోర్టులన్నింటినీ ఆ సంస్థకు అప్పజెప్పామని బదులిచ్చారు. టెండర్లు లేకుండానే వ్యాప్కోస్‌కు అప్పజెప్పాల్సిందిగా ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఫీల్డ్ ఇంజినీర్లుగా తాము పాటించామన్నారు. బ్యారేజీలకు సంబంధించి టెండర్లు, నిర్మాణం, గేట్ల ఆపరేషన్, కాఫర్ డ్యామ్ నిర్మాణం, అంచనా వ్యయం పెంపు... తదితర విషయాల్లో అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీశ్‌రావు పేరును చీఫ్ ఇంజినీర్ సుధాకర్‌రెడ్డి మూడుసార్లు ప్రస్తావించారు. ప్రాణహిత ప్రజెక్టుకు రీ-డిజైన్ పేరుతో అంచనా వ్యయాన్ని రూ. 40 వేల కోట్ల నుంచి రూ. 1.27 లక్షల కోట్లకు పెంచి నిర్మించిన తర్వాత అదనంగా వచ్చే ఆయకట్టు లక్ష్యం రెండు లక్షల ఎకరాలేనా?... దీని కోసం వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టాల్సి వచ్చిందా?.. అంటూ సుధాకర్‌రెడ్డిని నిలదీశారు.

కాళేశ్వరం కార్పొరేషన్‌ ఏర్పాటులో నిర్ణయం ఎవరిది?... ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయి?.. ఆ ప్రతిపాదనకు ఆమోదం ఎక్కడ లభించింది?.. అంటూ జస్టిస్ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా చీఫ్ ఇంజినీర్‌ సుధాకర్‌రెడ్డిని నిలదీశారు. కార్పొరేషన్ పెట్టాలనే నిర్ణయం ప్ఱభుత్వం తీసుకున్నదని, అప్పటి ఇరిగేషన్ మంత్రిగా హరీశ్‌రావు ఆధ్వర్యంలోనే ఈ ప్రాసెస్ జరిగిందని రిప్లై ఇచ్చారు. బ్యారేజీలను నిర్మించిన కాంట్రాక్టు సంస్థలు సకాలంలోనే బిల్లులను సమర్పించాయా అని అడగ్గా... అన్నారం, సుందిళ్ళ నిర్మాణానికి సంబంధించి ఫైనల్ బిల్లులు వచ్చాయని, మేడిగడ్డ విషయంలో మాత్రం ఇంకా సబ్‌మిట్ చేయలేదన్నారు. ఎందుకు ఆలస్యమయ్యాని ప్రశ్నించగా సీఈ ఇచ్చిన వివరణ, కారణాలపై కమిషన్ సంతృప్తి చెందలేదు. మేడిగడ్డ బ్యారేజీ కింద బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు సర్‌దీప్ కన్సల్టింగ్ ఇంజినీర్స్ అనే సంస్థ, జాదవ్‌పూర్ యూనివర్శిటీ సంయుక్తంగా అధ్యయనం చేసి బోర్ హోల్స్ వేసి నిర్ధారించి నివేదిక అందజేసిన అంశంలో సీఈగా మీకు తెలియదా అని ప్రశ్నించగా, ఒక్క బోర్ హోల్ దగ్గర మాత్రమే అలంటి పాజిటివ్ రిపోర్టు వచ్చిందని, మిగిలినచోట్ల రాలేదని బదులిచ్చారు. ఆ నివేదికను తాను చదివానని తెలిపారు.

మూడు బ్యారేజీల డ్యామేజీకి కారణాలను సీఈ సుధాకర్‌రెడ్డి వివరిస్తూ... మేడిగడ్డ దగ్గర 100 మీటర్ల వరకు నీటిని నిల్వ చేయవచ్చని, ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే స్టోర్ చేయాల్సి వచ్చిందన్నారు. డ్యామేజీకి కారణాలను వివరిస్తూ, డిజైన్‌లో జరిగిన మార్పులతో బ్యారేజ్ పొడవు, వెడల్పు విషయంలో తేడాలు ఉన్నాయని, దీనికి తోడు ‘ఎనర్జీ డిస్సిపేషన్’ స్టడీలో క్లారిటీ వచ్చినా దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోలేదని, గేట్ల ఆపరేషన్‌లో జరిగిన తేడాలతో డ్యామేజీ జరిగిందన్నారు. ప్రవాహ ఉధృతికి తగినట్లుగా గేట్ల ఆపరేషన్ జరిగి ఉంటే మరోలా ఉండేదని, కాఫర్ డ్యామ్‌తో పాటు షీట్ పైల్స్ ను అక్కడి నుంచి తొలగించకపోవడం కారణంగా నష్టం జరిగి సిమెంట్ కాంక్రీట్ బ్లాక్స్, ఆప్రాన్ తదితరాలు కొట్టుకుపోయాయన్నారు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జస్టిస్ ఘోష్... నిజాలను దాచే ప్రయత్నం చేయొద్దని, అలా చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మేడిగడ్డ బ్యారేజీకి సబ్‌స్టాన్షియల్ కంప్లీషన్ సర్టిఫికెట్ జారీ చేసే ముందు తనిఖీలు చేపట్టలేదనే అంశంపై జస్టిస్ లేవనెత్తిన ప్రశ్నకు డాక్యుమెంట్లను, రికార్డును చెక్ చేయాలనే నిబంధన ఎక్కడా లేదని సమాధానం ఇవ్వడంతో ఈ వార్నింగ్ ఇచ్చారు.

బ్యారేజీ నిర్మాణం పూర్తయ్యి 2019లో ప్రారంభోత్సవం జరిగిన తర్వాత వచ్చిన వరదలతో జరిగిన డ్యామేజీలను నిర్మాణ సంస్థలు పూర్తిగా పరిష్కారం చేశాయా అని కమిషన్ ప్రశ్నించగా... మేడిగడ్డలో నిర్మాణ సంస్థ పరిష్కారం చేయలేదని వివరించారు.

Advertisement

Next Story