ఆఫ్ఘనిస్తాన్‌లో కుండపోత వర్షాలు.. 40 మంది మృతి.. 347 మందికి గాయాలు

by Harish |
ఆఫ్ఘనిస్తాన్‌లో కుండపోత వర్షాలు.. 40 మంది మృతి.. 347 మందికి గాయాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆఫ్ఘనిస్తాన్‌లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో కుండపోత వర్షాలతో అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు అన్ని కూడా జలమయం అయ్యాయి. నదుల్లో నీటి ప్రవాహం విపరీతంగా పెరిగింది. ఈ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 40 మందికి పైగా మృతి చెందారు. అలాగే, 347 మందికి గాయాపడ్డారని అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా పేర్కొంది. అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

తాలిబాన్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తరువాత ఆఫ్ఘనిస్తాన్‌కు విదేశీ సహాయం చేరుకోవడం చాలా కష్టంగా మారింది. ఇప్పుడు దాని ప్రభావం ప్రస్తుత వరదలపై కూడా పడింది. స్థానికంగా ఉన్న వైద్యులు కొంతమంది అక్కడి వారికి చికిత్స అందిస్తున్నారు. దాదాపు 400 ఇళ్ల వరకు కూలిపోగా ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. రోడ్లపై భారీగా నీరు పారుతుంది, ఇళ్లలోకి సైతం చేరుతుంది. ఇటీవల ఓ ఇంటి పైకప్పు కూలిపోవడంతో ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి.

చాలా వరకు విద్యుత్ స్తంభాలు నేలమట్టం అయ్యాయి. దీంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. 2021లో తాలిబాన్ చేతిలోకి వచ్చిన తరువాత అస్థిరత పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆఫ్ఘనిస్తాన్‌లో తాజాగా ఈ భారీ వర్షాలు అక్కడి ప్రజలను కోలుకోలేని విధంగా చేశాయి. మేలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా వందలాది మంది చనిపోగా, వ్యవసాయ భూములు చాలా వరకు నాశనం కాగా, ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితే తలెత్తింది.

Advertisement

Next Story

Most Viewed