పోర్న్ స్టార్ కేసులో దోషిగా అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌

by Harish |   ( Updated:2024-05-31 03:59:09.0  )
పోర్న్ స్టార్ కేసులో దోషిగా అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఎన్నికలకు ముందు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌ను ఎన్నికల సమయంలో నోరు విప్పకుండా ఉండటానికి ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పారనే ఆరోపణలపై ట్రంప్‌ను న్యూయార్క్ కోర్టు దోషిగా గుర్తించింది. దీంతో మొట్టమొదటిసారిగా ఒక కేసులో దోషిగా తేలిన అమెరికా మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. మరో ఐదు నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి టైంలో కోర్టులో దోషిగా తేలడంతో దీని ప్రభావం ఎన్నికల్లో కనిపించనుంది.

న్యూయార్క్ కోర్టు పేర్కొన్న దాని ప్రకారం, దాదాపు 34 అంశాల్లో ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజమేనని నిర్ధారించింది. అడల్ట్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌తో ట్రంప్ ఏకాంతంగా గడిపారని ఆరోపణలు వచ్చాయి. 2016 ఎన్నికల టైంలో ఈ విషయం గురించి బయట మాట్లాడకుండా ఉండటానికి ట్రంప్ తన లాయర్ ద్వారా డేనియల్స్‌కు $130,000 చెల్లించినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈ డబ్బులను ట్రంప్ ప్రచారాల కోసం అందిన విరాళాల నుంచి చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దానికోసం రికార్డులన్నింటినీ మార్చారని అభియోగాలు వచ్చాయి. ఈ కేసులో వచ్చిన అన్ని ఆరోపణలు కూడా నిజమేనని కోర్టు తాజాగా గుర్తించి ట్రంప్‌ను దోషిగా నిర్దారించింది.

దీనిపై స్పందించిన ట్రంప్.. కోర్టు వెలుపల అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన మీద వచ్చిన అన్ని ఆరోపణలు ప్రభుత్వ కుట్ర అని అన్నారు. ఈ కేసులో ఆయనకు జులై 11న శిక్ష ఖరారు కానుంది. ట్రంప్ దోషిగా తేలినప్పటికీ కూడా రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదని నిపుణులు పేర్కొంటున్నారు. కోర్టు శిక్షను ఖరారు చేసిన తర్వాత పై కోర్టులో అప్పీల్ చేయడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన న్యాయవాదులు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed