Sheikh Hasina : ప్రధాని నివాసంలోకి నిరసనకారులు.. షేక్ హసీనా చీరలు చోరీ

by Hajipasha |
Sheikh Hasina : ప్రధాని నివాసంలోకి నిరసనకారులు.. షేక్ హసీనా చీరలు చోరీ
X

దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి షేక్ హసీనా భారత్‌కు వెళ్లిపోయాక ఢాకా నగరంలో నిరసనకారులు హల్‌చల్ చేశారు. ప్రత్యేకించి ప్రధాని అధికారిక నివాసంలోకి ప్రవేశించి అందులో ఉన్న బీరువాలను తెరిచారు. షేక్ హసీనాకు సంబంధించిన చీరలు, పెయింటింగ్స్, ఫర్నీచర్, పుస్తకాలను దొంగిలించుకొని పరారయ్యారు. కొందరైతే షేక్ హసీనా వినియోగించిన పడకపై పడుకొని ఫొటోలు, వీడియోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓ నిరసనకారుడు షేక్ హసీనా చీరను ధరించి ఫొటోలకు ఫోజులివ్వడం గమనార్హం. బంగ్లాదేశ్ మీడియాలో ఇవన్నీ ప్రసారమయ్యాయి. హసీనా సన్నిహితుల ఇళ్లపైనా నిరసనకారులు దాడులు చేశారు. ఇక దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఢాకాలోని షా జలాల్ అంతర్జాతీయ విమానాశ్రయ సర్వీసులను సోమవారం రాత్రి ఆరుగంటల పాటు నిలిపివేశారు.

షేక్ హసీనాతో అజిత్ దోవల్ కీలక చర్చలు

భారత్‌కు చేరుకున్న షేక్ హసీనాతో భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ భేటీ అయ్యారు. బంగ్లాదేశ్ నుంచి సైనిక విమానంలో బయలుదేరిన షేక్ హసీనా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉన్న హిండాన్ వైమానిక స్థావరానికి సోమవారం సాయంత్రం చేరుకున్నారు. ఆ వైమానిక స్థావరంలోనే షేక్ హసీనాతో అజిత్ దోవల్ భేటీ అయినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ ప్రణాళికపై షేక్ హసీనాతో దోవల్ చర్చించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. షేక్ హసీనా భారత్‌కు చేరుకున్న వెంటనే.. బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాల గురించి ప్రధాని మోడీకి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ వివరించారు.

Advertisement

Next Story