అమెరికా అధ్యక్ష రేసు నుంచి నిక్కీ హేలీ ఔట్.. ప్రచారంలో చివరి కామెంట్ ఇదీ

by Hajipasha |   ( Updated:2024-03-06 17:05:01.0  )
అమెరికా అధ్యక్ష రేసు నుంచి నిక్కీ హేలీ ఔట్.. ప్రచారంలో చివరి కామెంట్ ఇదీ
X

దిశ, నేషనల్ బ్యూరో : భారత సంతతికి చెందిన అమెరికా రాజకీయ నాయకురాలు నిక్కీ హేలీ కీలక ప్రకటన చేశారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్ధిత్వం కోసం ఇప్పటివరకు మాజీ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో హోరాహోరీగా తలపడిన నిక్కీ.. ఇక పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. బుధవారం నుంచి ఆమె తన ప్రచారాన్ని అధికారికంగా ఆపేశారు. దీంతో రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్ధిత్వానికి ఈసారి ఒకే ఒక్క నాయకుడు మిగిలాడు. ఆయనే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నిక్కీ హేలీ ప్రచారంలో చివరగా బుధవారం ఉదయం సౌత్ కరోలినాలోని చార్లెస్టన్‌లో తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇప్పటివరకు తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఇక తన ప్రచారాన్ని ఆపేయడానికి సమయం ఆసన్నమైందన్నారు. “మా రిపబ్లికన్ పార్టీలోని అందరినీ.. ఇతర పార్టీలలోని ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకోవాల్సిన బాధ్యత ఇక ట్రంప్‌పైనే ఉంది. ఆ దిశగా చేసే ప్రయత్నంలో ఆయన సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాను’’ అని నిక్కీ హేలీ చెప్పారు. చివరిసారిగా 1956వ సంవత్సరంలో అమెరికాలో సిట్టింగ్ అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు ఎన్నికల్లో తలపడ్డారు మళ్లీ ఇప్పుడు అదే తరహా పోటీని మనం ఈ ఏడాది నవంబరులో చూడబోతున్నాం.

Advertisement

Next Story