గాజాలో మారణ హోమం: 34,535కి చేరిన మృతుల సంఖ్య

by samatah |
గాజాలో మారణ హోమం: 34,535కి చేరిన మృతుల సంఖ్య
X

దిశ, నేషనల్ బ్యూరో: సుమారు ఏడు నెలలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధంలో ఇప్పటివరకు 34,535 మంది పాలస్తీనియన్లు మరణించినట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. అలాగే 77, 204 మంది గాయపడ్డారని తెలిపింది. గత 24 గంటల్లోనే 47 మంది మృతి చెందినట్టు పేర్కొంది. వేల మంది ప్రజలు నిరాశ్రయులైనట్టు తెలిపింది. మృతుల్లో ఎక్కువగా పిల్లు మహిళలే ఉన్నట్టు అధికారులు తెలిపారు. వైద్య, మౌలిక సదుపాలయాకుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వెల్లడించారు. దీంతో పాటు భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్టు చెప్పారు.

కాగా, గతేడాది అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్ల దాడితో ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతోంది. రాకెట్లు, క్షిపణులతో అటాక్ చేస్తోంది. దీంతో గాజాలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. అయితే వెంటనే కాల్పుల విరమణ చేపట్టాలని పలు దేశాలు ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేసినప్పటికీ ఆ దేశ ప్రధాని నెతన్యాహు వినడం లేదు. పలు మార్లు కాల్పుల విరమణపై చర్చలు జరిగినప్పటికీ అవి సత్పలితాలు ఇవ్వడం లేదు.

Advertisement

Next Story