చంద్రుని నమూనాలతో విజయవంతగా భూమికి చేరిన చైనా నౌక

by Harish |   ( Updated:2024-06-25 09:07:07.0  )
చంద్రుని నమూనాలతో విజయవంతగా భూమికి చేరిన చైనా నౌక
X

దిశ, నేషనల్ బ్యూరో: అంతరిక్ష రంగంలో చైనా మరో ఘనత సాధించింది. రెండు నెలల తరువాత చంద్రుని నమూనాలతో చైనాకు చెందిన చాంగ్‌-6 నౌక మంగళవారం విజయవంతంగా భూమిని తిరిగి చేరుకుంది. చంద్రునికి అవతలి వైపు ఉన్న ఉపరితలం నుంచి దాదాపు 2 కిలోల మట్టి నమూనాలను తీసుకొచ్చిన నౌక ఉత్తర చైనీస్ ప్రాంతంలోని మంగోలియాలో మధ్యాహ్నం ల్యాండ్ అయింది. ఈ నౌకను మే 3న దక్షిణ ద్వీపం హైనాన్‌లోని వెన్‌చాంగ్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుండి ప్రయోగించారు. ఇది జూన్ 1న చంద్రుని అత్యంత పురాతనమైన, లోతైన బిలం అయిన దక్షిణ ధృవం-ఐట్‌కెన్ బేసిన్ అంచుపైకి దిగింది. ఆ తర్వాత చంద్రుని ఉపరితలంపై ఉన్న మట్టి, ఇతర ఖనిజాలు సేకరించింది. జూన్ 6 న ఆర్బిటర్‌తో డాక్ చేయబడగా, ఆ తరువాత భూమికి తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించింది. తాజాగా జూన్ 25న భూమికి మట్టి నమూనాలతో ఉన్న క్యాప్సూల్ చేరుకుంది.

క్యాప్సూల్ ల్యాండ్ అయిన వెంటనే చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అధిపతి జాంగ్ కెజియన్ మాట్లాడుతూ, చాంగ్‌-6 చంద్ర మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్రకటించారు. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మాట్లాడుతూ, చంద్రుని అవతలి వైపుకు చైనా నౌక చేరుకుని అక్కడి మట్టిని తీసుకురావడం గర్వకారణం. తన 53 రోజుల మిషన్‌ను పూర్తి చేసింది. చైనా అంతరిక్ష కార్యక్రమంలో ఇది ఒక ముఖ్యమైన విజయం అని అన్నారు. ప్రస్తుతం దిగ్గజ దేశాల మధ్య అంతరిక్షంలో పైచేయి సాధించడానికి తీవ్ర యుద్ధమే జరుగుతుంది. అగ్రరాజ్యం అమెరికాకు చైనా గట్టి పోటీ ఇస్తోంది. చంద్రుని వనరుల అన్వేషణ, అంతరిక్షం సైనికీకరణ వంటి అంశాల వారీగా ఈ దేశాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మరోవైపు భారత్ కూడా సొంతంగా అంతరిక్ష రంగంలో పట్టు సాధించడానికి తీవ్రంగా కృషి చేస్తుంది.

Advertisement

Next Story

Most Viewed