‘డబ్బు కొట్టు.. బెల్టు షాపు పట్టు’.. గ్రామాల్లో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బెల్టుషాపులు

by Jakkula Mamatha |
‘డబ్బు కొట్టు.. బెల్టు షాపు పట్టు’.. గ్రామాల్లో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బెల్టుషాపులు
X

ఏపీలో ప్రైవేట్ మద్యం దుకాణాల ఏర్పాటుతో గ్రామాల్లో వీధికో బెల్టు షాపు ఏర్పాటు చకచకా జరిగిపోతున్నాయి. వీటి కోసం టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోటీ పడుతుండడంతో మద్యం షాపుల నిర్వాహకులకు వరంగా మారింది. గ్రామానికో రేటు నిర్ణయించి అడ్వాన్స్ చెల్లించిన వారికి బెల్టు షాపు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బెల్టుషాపులు ఏర్పాటవుతున్న పట్టించుకోకపోవడంతో ఎక్సైజ్, పోలీస్ శాఖల పట్ల గ్రామాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి .

దిశ, నందికొట్కూరు: నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో మొత్తం 12 ప్రైవేటు మద్యం దుకాణాలు వెలిశాయి. నందికొట్కూరు మండలం కొణిదెలలో 2, మిడుతూరు మండలంలో 2, పగిడ్యాలలో 1, నందికొట్కూరు పట్టణంలో 4, జూపాడుబంగ్లా లో 1, కొత్తపల్లి మండలం 1, పాములపాడు మండలంలో 1 మద్యం షాపులను లాటరీలో దక్కించుకున్న నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే నిన్నటి వరకు మద్యం షాపుల పక్కనే కూల్ డ్రింక్స్ దుకాణాల ఏర్పాటు కోసం ఆయా గ్రామాల్లోని టీడీపీ నాయకుల మధ్య పోటీ జరిగింది. ఈ విషయంలో కొన్నిచోట్ల టీడీపీ నాయకుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. కూల్ డ్రింక్స్ షాపులు పంచాయితీ ముగిసిందిలే అనుకుంటే తాజాగా బెల్టుషాపుల పంచాయితీ మద్యం షాపు నిర్వాహకులకు తలనొప్పిగా మారింది. మా వర్గానికే బెల్టు షాపు ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సిందేనంటూ ప్రతి గ్రామంలో టీడీపీ నాయకులు పోటాపోటీగా మద్యం షాపు నిర్వాహకులపై ఒత్తిడి తెస్తున్నారు. కొందరు ఎవరి అనుమతులు తీసుకోకుండానే ఇప్పటికే తమకు నచ్చిన మద్యం షాపు నుంచి మద్యం బాటిళ్లు తీసుకువచ్చి బెల్ట్ దుకాణాలు తెరిచారు.

రూ.30 వేలు చెల్లిస్తేనే బెల్టుషాపునకు అనుమతి..

నియోజకవర్గ పరిధిలోని 12 మద్యం దుకాణాల పరిధిలో బెల్టు షాపులను తెరిచేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు విపరీతంగా ఎగబడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే ఎవరి అనుమతులు లేకుండా బెల్టు దుకాణాలను ఏర్పాటు చేసి బహిరంగంగా అమ్ముతున్నారు. బెల్టు దుకాణాల ఏర్పాటుకు ప్రతి గ్రామం నుంచి నలుగురు నుంచి ఎనిమిది మంది వరకు పోటీ పడుతుండటంతో మద్యం దుకాణాల నిర్వాహకులకు వరంగా మారింది. బెల్టుషాపులు ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటే రూ.30 నుంచి 50 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే మద్యం బాటిల్ ఎమ్మార్పీ ధర కంటే అదనంగా రూ.10 లు పెంచి బెల్టుషాపులకు సరఫరా చేస్తామని చెబుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. జూపాడుబంగ్లా మండలం లోని మద్యం దుకాణం పరిధిలో ఉన్న గ్రామాల్లో బెల్ట్ షాపులు ఏర్పాటు చేసుకోవాలంటే ముందుగా రూ.50 వేలు చెల్లిస్తేనే అనుమతిస్తామని చెబుతున్నట్లు బెల్టు షాపులను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్న వ్యక్తులు బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. కాగా బెల్టు షాపు నిర్వాహకులు రూ.150 ఎమ్మార్పీ ఉన్న క్వార్టర్ బాటిల్‌ను బెల్టులో రూ.200లకు అమ్ముకుంటున్నారని విశ్వనీయ సమాచారం.

అధికారుల చర్యలేవీ..?

నియోజకవర్గంలో ప్రైవేట్ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసిన వెంటనే గ్రామాల్లో బెల్ట్ షాపులు అంతే వేగంగా తెరుచుకున్నాయి. కొన్ని గ్రామాల్లో నేతల మధ్య ఉన్న పోరు కారణంగా పోటాపోటీగా బెల్ట్ షాపులు తెరుచుకున్నాయి. నిబంధనల ప్రకారం బెల్టు షాపులు ఏర్పాటు చేయడం చట్టవ్యతిరేకమైన ఎక్సైజ్, పోలీస్ శాఖ. అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. కొన్ని గ్రామాల్లో పగలు, రాత్రి తేడా లేకుండా బెల్టుషాపులలో మద్యం విక్రయాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని మహిళలు మండిపడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని గ్రామాల్లో బెల్ట్ దుకాణాలు లేకుండా చర్యలు చేపట్టకపోతే మహిళలు రోడ్డెక్కుతామని హెచ్చరిస్తున్నారు.అధికారులు ఏలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Advertisement

Next Story