America : డల్లాస్ లోని మహాత్మాగాంధీ స్మారక స్థలిని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి బృందం

by Maddikunta Saikiran |
America : డల్లాస్ లోని మహాత్మాగాంధీ స్మారక స్థలిని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి బృందం
X

దిశ, వెబ్‌డెస్క్ :తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత రెడ్డి, ఐ.టి శాఖామంత్రి దుద్దిళ్ళ శ్రీధరబాబు, రహదారులు మరియు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లు అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో.. ఆ దేశంలోనే అతి పెద్దదైన డల్లాస్ నగరంలో నెలకొన్న మహాత్మాగాంధీ స్మారకస్థలిని సీఎం రేవంత్ బృందం బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు .. మన జాతిపితకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా..మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర సీఎం రేవంత రెడ్డి బృందానికి గాంధీ స్మారకస్థలి యొక్క నిర్మాణ వివరాలాను తెలియజేస్తూ .. '2014 అక్టోబర్ 2న ఈ స్మారకాన్ని నిర్మించామని, విజయవాడకు చెందిన శిల్పి బుర్రా వరప్రసాద్ ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారని తెలిపారు. ఈ గాంధీ స్మారకస్థలిని 18 ఎకరాల సువిశాలమైన ఉద్యానవనంలో ఏర్పాటు చేశామని' వెళ్ళడించారు. అలాగే స్మారకస్థలి ఏర్పాటుకు అనుమతినిచ్చిన నగర అధికారులకు,సహకరించిన వేలాదిమంది ప్రవాస భారతీయులకు వరప్రసాద్ అభినందనలు తెలిపారు. మహాత్మాగాంధీ స్మారకస్థలి 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ శుభతరుణంలో ప్రత్యేకంగా విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత రెడ్డి, మంత్రివర్యులు శ్రీధరబాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు వరప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు . కాగా.. అమెరికాలోని ఇండియన్ కాన్సల్ జనరల్ అయిన డి.సి మంజునాథ్ కూడా మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమం సందర్భంగా.. డా.ప్రసాద్ తోటకూర ప్రవాస తెలుగువారి తరపున రేవంత రెడ్డికి ఒక వినతిపత్రాన్ని అందజేశారు. ఆ వినతిపత్రంలో ఈ క్రింది విషయాలను పొందుపరచారు.మహాత్మాగాంధీ సిద్ధాంతాలైన శాంతి, సహనం, గౌరవం లాంటి అంశాలను విద్యార్దులకు పాఠ్యపుస్తకంలో చేర్చి చిన్నపటినుండే నేర్పాలి. ప్రభుత్వ కార్యాలయాలమీద పేర్లు, కార్యాలయాలలో ఉండే నామఫలకాలు, ప్రజా ప్రతినిధుల పేర్లు, శంకుస్థాపన ఫలకాలు అన్నీ తెలుగులోనే ఉండాలని అందులో పొందుపరిచారు. అలాగే కనీసం ప్రాధమికస్థాయి వరకైనా మాతృభాషలో విద్యార్థులకు విద్యాభోదన జరగాలని , తెలుగు మీడియంలో చదువుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో కొంతశాతం మేరకు వెసులుబాటు కల్పించి ప్రోత్సహించాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని సంగీత, నాట్య, రంగాలలోని ప్రముఖులను రాష్ట్రప్రభుత్వం కొంతమందిని ఎంపికచేసి ప్రభుత్వం తరపున అమెరికాలాంటి విదేశాలకు నిత్యం పంపడంవల్ల తెలుగు సంస్కృతి, సంప్రదాయ, వారసత్వ వైభవాన్ని విదేశాలలో ఉన్న వారికి తెలియచెప్పినట్లవుతుందని ఆ వినతి పత్రంలో పొందు పరిచారు. ఈ కార్యక్రమంలో.. మహాత్మాగాంధీ మెమోరియల్ బోర్డు సభ్యులు రావు కల్వల, సుష్మా మల్హోత్రా, కమల్ కౌశల్, మురళీ వెన్నం, రాజీవ్ కామత్, బి.ఎన్ రావు, వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులు, వందలాది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed