ఈ హృదయ విదారక దృశ్యాలు.. చూస్తుంటే కళ్లలో నీళ్లు ఆగుతలేవ్

by S Gopi |   ( Updated:2023-02-08 13:44:43.0  )
ఈ హృదయ విదారక దృశ్యాలు.. చూస్తుంటే కళ్లలో నీళ్లు ఆగుతలేవ్
X

అంటక్య (టర్కీ)/న్యూఢిల్లీ: చిన్న బిడ్డను శిథిలాల నుంచి సజీవంగా బయటికి తీయడం, ఓ తండ్రి చనిపోయిన కుమార్తె చేతిని పట్టుకుని వదలకుండా ఉండటం వంటి హృదయ విదారక దృశ్యాలు బుధవారం టర్కీ, సిరియాలలో కనిపించాయి. దాదాపు 11,200 మందికిపైగా చనిపోయినట్లు వార్తలు అందుతున్నాయి. సోమవారం 7.8 తీవ్రతతో భూకంపం సంభవించినప్పటి నుంచి రెండ్రోజులు రాత్రింభవళ్లు విపరీతమైన చలిలో రక్షణ బృందాలు, సైన్యం... సరిహద్దుకు ఇరువైపులా శిథిలాల కింద ఉన్నవారిని రక్షించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.


సోమవారం సంభవించిన భూకంపంలో టర్కీకి చెందిన 8,574 మంది, సిరియాకు చెందిన 2,662 మంది మొత్తం 11,236 మంది మరణించారని అధికారులు చెబుతున్నారు. భూకంప కేంద్రానికి సమీపంలోని కహ్రామన్‌మారాస్‌లో నివసించే మెసుట్ హాన్సర్‌ గడ్డకట్టే చలిలో శిథిలాలపై కూర్చున్నాడు. చాలా దుఃఖంతో ఉన్నాడు. అతని చేతిలో 15 ఏళ్ల కుమార్తె చెయ్యి ఉంది. ఆమె చేతిని విడిచిపెట్టడానికి ఆ తండ్రి నిరాకరిస్తున్నాడు. ఆమె కాంక్రీటు స్లాబ్ కింద నలిగిపోయి చనిపోయి ఉంది. తూర్పు ఎజ్రింకన్ ప్రాంతంలో 1939లో ఓసారి భూకంకం వచ్చింది. అప్పుడు 33 వేల మంది చనిపోయారు. ఆ తర్వాత ఇదే అతి పెద్ద భూకంపం. 1999లోనూ భూకంపం సంభవించింది. అప్పుడు 17 వేల మంది మృతిచెందారు. ఇస్తాన్‌బుల్‌లోనూ భారీ భూకంపం వచ్చే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇస్తాన్‌బుల్‌లో 16 మిలియన్ల మంది నివసిస్తున్నారు.


చలికి వణికిపోతున్న చిన్నారులు

జీవించి ఉన్నవాళ్లకు భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తోంది. వాతావరణం కొంచెం కూడా కనికరించడం లేదు. వర్షం కురుస్తోంది. మంచు పడుతోంది. దీంతో మసీదులు, పాఠశాలలు, బస్ షెల్టర్‌లలో తలదాచుకుంటున్నారు. వెచ్చగా ఉండటానికి చలి మంట పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సహాయక చర్యలు మందకొడిగా సాగుతుండటంతో కొంతమంది ఆవేదన, మరికొంత మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'నా సోదరుడిని శిథిలాల కింది నుంచి సజీవంగా తెచ్చుకోలేను. నా మేనల్లుడు తిరిగి రాలేడు. ఇటు చూడండి. రాష్ట్ర అధికారులెవ్వరూ ఇక్కడ కనిపించడం లేదు. రెండ్రోజులుగా ఒక్క అధికారిని కూడా నేను చూడలేదు. ఈ చలికి పిల్లలు వణికిపోతున్నారు' అని కహ్రమన్‌మరాస్‌కు చెందిన అలి సగిరొగ్లు చెప్పాడు. దగ్గర్లోనే గజియన్‌టెప్ ఉంది. కానీ అక్కడి దుకాణాలన్నీ మూసి వేశారు. పేలుళ్లు జరగకుండా గ్యాస్ పైప్ లైన్లను కట్ చేశారు. పెట్రోల్ దొరకడం కూడా చాలా కష్టంగా మారింది. రాజకీయ నేతలకు, సెలబ్రిటీలకు స్వాగతం పలికే టర్కీ విమానాశ్రయ టెర్మినెల్‌లో దాదాపు 100 మంది దుప్పట్లు కప్పుకుని నిద్రించడం మీడియా కంటపడింది.

కష్టాల్లో ఉన్న టర్కీ, సిరియా దేశాలను ఆదుకునేందుకు డజన్ల కొద్ది దేశాలు ముందుకొస్తున్నాయి. భారత్, యునైటెడ్ స్టేట్స్, చైనా, గల్ఫ్ దేశాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. రక్షణ బృందాలతోపాటు సహాయక సామాగ్రిని పంపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన నాలుగవ విమానం సీ-17 భూకంప ప్రభావిత ప్రాంతానికి చేరుకుంది. 54 మంది సహాయక బృందంతోపాటు మెడికల్ కిట్స్‌తో ఈ విమానం అదనాలో ల్యాండ్ అయింది. 'వైద్యానికి అవసరమైన పరికరాలతో నాల్గవ ఐఏఎఫ్ ఎంసీసీ ఎయిర్‌క్రాఫ్ట్ టర్కీకి చేరుకుంది. ఈ విమానంలో 54 మందితో కూడిన ఇండియన్ ఆర్మీ బృందం, వైద్య, ఇతర పరికరాలను పంపించాం' అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బగ్చి ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed