- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు ప్రపంచ జల దినోత్సవం.. పది ఆసక్తికర విషయాలు
దిశ, వెబ్‌డెస్క్: జలమే జీవనాధారం. నీరు లేనిదే సమస్త జీవ కోటికి మనుగడ లేదు. అసలు జీవ పరిణామం ప్రారంభమైందే సముద్ర గర్భంలో అనే విషయం తెలిసిందే. ఒకప్పుడు పుష్కలంగా లభించే మంచి నీటిని అభివృద్ధి పేరిట కలుషితం చేస్తున్నాం. అవసరానికి మించి వాడుతూ వాటిని వృథా చేస్తున్నాం. దీంతో సమీప భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు జరిగే రోజులు కూడా రానున్నాయనడంలో ఆశ్చర్యమేమీ లేదంటే అతిశయోక్తి కాదేమో. ఈ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే ఐక్యారాజ్య సమితి ‘ప్రపంచ జల దినోత్సవం’ (వరల్డ్ వాటర్ డే) ను నిర్వహిస్తున్నది. ప్రతియేటా మార్చి 22న దీనిని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.
భూగర్భ జలాలను పెంచడం, వర్షపు నీటిని ఒడిసిపట్టి ఆ నీటిని సక్రమంగా వినియోగించడం, దుర్వినియోగాన్ని అరికట్టడం దీని ప్రధాన లక్ష్యం. అంతేగాక నీటి విలువను తెలియజేస్తూ భావితరాలకు తాగు, సాగునీరు లభ్యంగా ఉండే విధంగా ఈరోజు అవగాహన కార్యక్రమాలను రూపొందిస్తారు. ఇక ఈ ఏడాది వరల్డ్ వాటర్ డే విషయానికొస్తే.. ‘ప్రజలకు నీరు, దాని విలువ, ఆ వనరును మనం ఎలా సంరక్షించుకోగలం’ అనేదానిమీద అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. సాధారణంగా మనకు లభిస్తున్న నీటి విలువ.. దానికి నిర్దేశించిన ధర కంటే చాలా రెట్లు ఎక్కువ.
వరల్డ్ వాటర్ డే.. పది ఆసక్తికర విషయాలు
1. ప్రపంచంలో నేడు ప్రతి ముగ్గురిలో ఒకరికి శుద్ధమైన తాగునీరు దొరకడం లేదు.
2. 2050 నాటికి భూమి మీద నివసిస్తున్న వారిలో సుమారు 5.7 బిలియన్ల (500 కోట్ల పైమాటే) మంది సంవత్సరానికి ఒక నెల పాటు నీటి కొరత ఎదుర్కుననున్నారని అంచనా.
3. మంచి నీటి సరఫరా, పారిశుధ్యం సక్రమంగా ఉంటే ప్రతి యేటా 3,60,000 వేల మంది శిశువుల ప్రాణాలను కాపాడుకోవచ్చు.
4. గ్లోబల్ వార్మింగ్‌ను పూర్వస్థాయి కంటే 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేస్తే వాతావరణ ప్రేరిత నీటి ఒత్తిడిని 50 శాతం వరకు తగ్గించవచ్చు.
5. గత దశాబ్దంలో 90 శాతానికి పైగా విపత్తులు తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగానే తలెత్తాయి.
6. 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఇంధన డిమాండ్ 25 శాతానికి, నీటి డిమాండ్ 50 శాతానికి పైగా పెరగనుందని అంచనా.
7. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా అందరికీ నీరు, పారిశుధ్యం కల్పించాలని ఐరాస లక్ష్యంగా పెట్టుకుంది.
8. 2018-2028 దశాబ్దాన్ని ‘వాటర్ ఫర్ సస్టెనెబుల్ డెవలప్‌మెంట్’గా ఐరాస జనరల్ అసెంబ్లీ ప్రకటించింది.
9. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠశాలలో సగానికంటే ఎక్కువ స్కూళ్లలో విద్యార్థులకు హ్యాండ్ వాషింగ్ సౌకర్యాలు లేవు. కనీసం చేతులు కడుక్కోవడానికి నీరు, సబ్బు కూడా అందుబాటులో లేని స్కూళ్లు కూడా చాలా ఉన్నాయి.
10. అపరిశుభ్రమైన నీరు తాగి ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా 2,97,000 మంది (సుమారు రోజుకు 800) పిల్లలు అతిసారం బారిన పడి చనిపోతున్నారు.