భర్త ఇంట్లోకి రాకుండా.. అడ్డుపడ్డ భార్య

by Sridhar Babu |
భర్త ఇంట్లోకి రాకుండా.. అడ్డుపడ్డ భార్య
X

దిశ, సిరిసిల్ల: కరోనా మహమ్మారి ప్రాణాలనే కాకుండా భార్యా భర్తల మధ్య అన్యోన్యతను కూడా చంపేస్తోంది. కరోనా కారణంగా చివరకు కట్టుకున్న భర్తనే ఇంట్లోకి రానివ్వలేదో భార్య. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సిరిసిల్ల పట్టణానికి చెందిన నేత కార్మికుడు ఒకరు బతుకుదెరువు కోసం మహారాష్ట్రలోని భీంవాడికి వెళ్లి ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. కరోనా మూలంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా ఆ పరిశ్రమ మూతపడటంతో ఉపాధి లేకుండా పోయింది. దీంతో సిరిసిల్లకు చేరుకున్న సదరు వ్యక్తి ఇంటికి వెళ్లగా కరోనా భయంతో ఇంట్లోకి రావద్దని భార్య వారించింది. ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారని, వారికేమైనా అయితే ప్రమాదమని ఆందోళన చెందింది. 14 రోజులు క్వారంటైన్ చేసిన తరువాతే ఇంట్లోకి అడుగుపెట్టాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా భర్త ఇంట్లోకి రాకుండా గేటుకు తాళం వేసేసింది. నేత కార్మికుడు ఇంట్లోకే రానివ్వని పరిస్థితిలో వేరే చోటకు వెళ్లడం అంత సులువు కాదని భావించి గేటు ముందే కొన్ని గంటలు వేచి చూసినా భార్య మాత్రం ఇంట్లోకి ఆహ్వానించలేదు. విషయం గమనించిన స్థానికులు ఆమెకు నచ్చచెప్పినా వినిపించుకోలేదు. చివరకు స్థానికులే డబ్బులు జమ చేసి ఇవ్వగా నేత కార్మికుడు తిరిగి భీవాండికీ వెల్లిపోయాడు.

Advertisement

Next Story