Punjab Bandh : ఈనెల 30న పంజాబ్ బంద్.. పిలుపునిచ్చిన రైతు సంఘాలు

by Hajipasha |
Punjab Bandh : ఈనెల 30న పంజాబ్ బంద్.. పిలుపునిచ్చిన రైతు సంఘాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశ రాజధాని న్యూఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనకు దిగిన రైతులు(Farmers) కీలక ప్రకటన చేశారు. సోమవారం రోజు (డిసెంబరు 30న) పంజాబ్‌ రాష్ట్ర బంద్‌(Punjab Bandh)కు పిలుపునిచ్చారు. ఈనెల 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్‌కు సహకరించాలని ప్రజలను రైతులు కోరారు. ఆ సమయంలో పంజాబ్‌లోని దుకాణాలన్నీ బంద్ చేయిస్తామని ప్రకటించారు. రోడ్డు రవాణా వ్యవస్థ, రైల్వే సర్వీసులను కూడా స్తంభింపజేస్తామన్నారు. బంద్ జరగనున్న సమయంలో రాష్ట్ర ప్రజలకు పాలు, పండ్లు, కూరగాయల వంటి నిత్యావసరాలు అందుబాటులో ఉండవని రైతులు వెల్లడించారు. అయితే అంబులెన్స్‌లు, వివాహ వాహనాల వంటి అత్యవసర సేవలను అడ్డుకోమని స్పష్టం చేశారు. తమ బంద్‌కు వాణిజ్య సంస్థలు సైతం మద్దతు ప్రకటించాయన్నారు. బంద్‌కు మద్దతుగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను మూసి ఉంచాలని కోరారు.

డిసెంబర్ 30వ తేదీన పంజాబ్ బంద్ నిర్వహిస్తామని గత వారమే సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్)తో పాటు కిసాన్ మజ్దూర్ మోర్చా నిర్ణయం తీసుకున్నాయి. ఈ బంద్‌‌కు పంజాబ్‌లోని వ్యాపారులు, ఉద్యోగ సంఘాలు, కార్మికులు, మాజీ సైనికులు, సర్పంచ్‌లతోపాటు వివిధ వర్గాల వారు మద్దతు ప్రకటించారు.పంటలకు కనీస మద్దతు ధరలు కల్పించాలంటూ 101 మంది రైతుల టీమ్ గత కొంత కాలంగా పంజాబ్, ఢిల్లీ సరిహద్దుల్లోని శంభు ప్రాంతంలో దీక్ష చేస్తున్నారు. వారంతా కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి తమ డిమాండ్లను వివరించేందుకు చాలాసార్లు యత్నించారు. అయితే వారిని భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. ఈ అంశంపై 2025 సంవత్సరం జనవరి 4న పంజాబ్‌లోని ఖనౌరీ పట్టణంలో కిసాన్ మహాపంచాయత్ నిర్వహించాలని యోచిస్తున్నామని ఆందోళన చేస్తున్న రైతుల టీమ్ ప్రకటించింది. మరోవైపు పంజాబ్‌లో రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష ఆదివారంతో 34వ రోజుకు చేరుకుంది. గాంధేయ మార్గంలో నిరసన తెలుపుతున్న దల్లేవాల్ దీక్షను బల ప్రయోగంతో భగ్నం చేయాలనే ఆలోచన సరైనదో కాదో తేల్చుకోవాలని పంజాబ్ ప్రభుత్వానికి రైతు నేతలు అల్టిమేటం ఇచ్చారు.

Advertisement

Next Story