మార్కెట్ పోస్టుల కోసం నేతల కనికట్టు..

by Sumithra |
మార్కెట్ పోస్టుల కోసం నేతల కనికట్టు..
X

దిశ, మేడ్చల్ బ్యూరో : లేనివి ఉన్నట్టు.. మార్కెట్ పదవుల కోసం నేతలు కనికట్టు చేస్తున్నట్లు తెలిసింది. చేయని వ్యవసాయాన్నిచేసినట్టు.. లేని పాడి పశువులు ఉన్నట్టు కాగితాల్లో చూపిస్తూ మాయ చేసేందుకు రేడీ అవుతున్నట్లు సమాచారం. దొడ్డిదారిన మార్కెట్ కమిటీ పోస్టులను కొట్టేసి, దర్జా వెలగబెట్టేందుకు కొందరు నేతలు పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలోనే ప్రసిద్ది చెందిన బోయిన్ పల్లి, గుడి మల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలలో చోటు కోసం తప్పుడు ధృవీకరణ పత్రాలను సమర్పించినట్లు తెలిసింది. మార్కెట్ చట్టాన్ని తుంగలో తొక్కి అడ్డదారిలో మార్కెట్ పోస్టులను దక్కించుకోకుండా సంబంధిత శాఖ తగు చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

మలక్ పేటలో వెలుగులోకి..

మలక్ పేట మహబూబ్ మాన్షన్ హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ఎంపిక వివాదాలకు తావిస్తోంది. నూతన కమిటీ సభ్యులు వ్యవసాయదారులా...? వారి వృత్తి పై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించగా, విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. మార్కెట్ ఛైర్మన్ గా నియమితులైన చెకోలేకర్ లక్ష్మీ శ్రీనివాస్, వైస్ ఛైర్మన్ కోట శ్రీనివాస్ లకు తలో మూడు బర్రెలు ఉన్నట్లు వారు సమర్పించిన ధృవీకరణ పత్రంలో పేర్కొన్నారు. కీలక పదవులలో ఉన్న ఛైర్మన్, వైస్ ఛైర్మన్ లకు వ్యవసాయ భూములు లేవని, వ్యవసాయం చేయడంలేదని పేర్కొన్నారు. వీరితో పాటు సభ్యులుగా ఎన్నికైన వారు కూడా వ్యవసాయం చేయడంలేదని ఆవులు, బర్రెలు మాత్రమే ఉన్నట్లు పత్రాలను సమర్పించారు. అయితే వీరందరు వేర్వేరు మండలాలకు చెందినప్పటికీ, ఒకే పశు వైద్యాధికారి వద్ద ధృవీకరణ పత్రాలను తీసుకోవడం అనుమానాలకు తావిస్తోంది.

వ్యవసాయ మార్కెట్ ఎంపిక ఇలా...

వ్యవసాయ మార్కెట్ కు 18 మంది పాలక వర్గ సభ్యులు ఉంటారు. వీరిలో 14 మంది రైతులు, నలుగురు అధికారులు సభ్యులుగా ఉండాలి. ఆ 14 మంది రైతులలో 12 మంది సన్నకారు రైతులు, ఇద్దరు ట్రేడర్స్ (లైవ్ స్టాక్)ను నియమించాలి. వీరిలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళ, ఓసీ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరి చొప్పున ఐదుగురిని తీసుకోవాలి.సన్నకారు రైతులలో రెండు లేదా మూడు ఎకరాల భూములు కల్గి ఉన్న ఐదుగురు సభ్యులను తీసుకోవాలి. భూములను లీజు తీసుకొని వ్యవసాయం చేస్తామంటే కూడా చెల్లదు. సభ్యుల పేర్ల పై వ్యవసాయ భూములు రిజిష్టర్ అయి ఉండి, వ్యవసాయం చేస్తూ ఉండాలి. ఇకపోతే సభ్యులు ఖచ్చితంగా ఆయా మార్కెట్ పరిధికి కేటాయించిన రెవెన్యూ మండలాల పరిధిలోనే నివాసం ఉన్నవారై ఉండాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా బోయిన్ పల్లి, గుడిమల్కాపూర్ మార్కెట్ పాలక మండలిలో చోటు దక్కించుకునేందుకు పలువురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

కోర్టును ఆశ్రయిస్తాం.. మాణిక్ ప్రభు, కార్యదర్శి ట్వీన్ సిటీస్ వెజిటేబుల్ కమీషన్ ఏజెంట్లు ఆసోసియేషన్

వ్యవసాయ మార్కెట్లలో పాలకమండలి సభ్యులను మార్కెటింగ్ చట్టంకు అనుగుణంగా నియమించాలి. ఇప్పటికే మలక్ పేట మహబూబ్ మాన్షన్ మార్కెట్ కమిటీలో నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సమర్పించిన వారికి మార్కెట్ కమిటీలలో అవకాశం కల్పించారు. వ్యవసాయం చేయని వారు, అవగాహన లేని వారిని మార్కెట్ కమిటీలలో చోటు కల్పిస్తే.. వారు రైతులకు ఏ విధంగా మేలు చేస్తారు. దీనిపై ట్వీన్ సిటీస్ వెజిటేబుల్ కమీషన్ ఏజెంట్స్ ఆసోసియేషన్ తరపున కోర్టును అశ్రయించబోతున్నాయి.ఇప్పటికైనా మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు అడ్డదారిలో పదవులను పొందిన వారిపై విచారణ జరిపి, వారిని పదవుల నుంచి తొలగించాలి. బోయిన్ పల్లి, గుడి మల్కాపూర్ మార్కెట్లకు నియమించబోయే కమిటీలను మార్కెటింగ్ చట్టానికి లోబడి నియమించాలి.

Advertisement

Next Story