ఎడ్లబండిపై మృతదేహం.. కాడేడ్లుగా కుటుంబసభ్యులు

by Anukaran |   ( Updated:2020-07-13 05:44:21.0  )
ఎడ్లబండిపై మృతదేహం.. కాడేడ్లుగా కుటుంబసభ్యులు
X

దిశ, నల్లగొండ: కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విపత్కర పరిస్థితులు నెలకొంటున్నాయి. మహమ్మారి భయానికి తోటివారిని ముట్టుకునేందుకు జంకే పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా సోకిందని అనుమానం వచ్చినా.. కన్న తల్లిదండ్రులు, కట్టుకున్న భర్త అన్న తేడా లేకుండా నడిరోడ్డుపైనే వదిలేసి వెళుతున్నారు. కరోనా సోకి చనిపోయిన వారి మృతదేహాలను కనీసం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఊళ్లల్లోకి రానివ్వడం లేదు. చనిపోయిన వారికి ఎంతో గౌరవంగా నిర్వహించే అంత్యక్రియల కార్యక్రమాన్ని చేసేందుకు పట్టుమని పది మంది రావడం లేదు. చివరకు పాడే మోసే దిక్కు లేక మెషీన్లు, ఎడ్లబండ్ల మీద తీసుకెళ్లి గోతిలో పడేసి పూడ్చి వస్తున్నారు. ఒక మనిషిని మనిషిగా చూడలేని పరిస్థితులు నెలకొన్నాయి. రోజురోజుకూ మనుషుల్లో మానవత్వం కరువవుతోంది. తాజాగా సోమవారం నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామానికి చెందిన ఓ మహిళ కరోనా అనుమానిత లక్షణాలతో మరణించింది. ఆ మహిళ కరోనాతోనే చనిపోయిందనే ఉద్దేశంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు చేసేదేం లేక ఎడ్లబండిపై వేసుకుని ఇద్దరు వ్యక్తులు కాడెద్దులుగా మారి శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అక్కడ అప్పటికే తీసి పెట్టిన గోతిలో మృతదేహాన్ని పడేసి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

Advertisement

Next Story

Most Viewed