కరోనా డ్రగ్ ఉచితం: ఉద్ధవ్ ఠాక్రే

by Anukaran |   ( Updated:2020-06-28 05:52:44.0  )
కరోనా డ్రగ్ ఉచితం: ఉద్ధవ్ ఠాక్రే
X

ముంబయి: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఈ నెలాఖరుతో లాక్‌డౌన్ ముగిసిపోద్దని, కొన్ని సడలింపులతో కొనసాగిస్తామని ప్రకటించారు. ప్రజలు నిబంధనలు ఉల్లంఘిస్తే కరోనా కేసులు అధికంగా వెలుగుచూస్తున్న ప్రాంతాల్లో కఠిన లాక్‌డౌన్ విధిస్తామని అన్నారు. తగిన స్టాక్ సమకూరిన తర్వాత కరోనా మందులను ఉచితంగా అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనానికి పలుసేవలను అందుబాటులోకి తెస్తున్నందున వచ్చే రెండు మూడు వారాల్లో కరోనా కేసులు ఇంకా పెరిగే అవకాశమున్నదని, అయితే, ఈ మహమ్మారితో పోరాడటానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. టెస్టింగ్ సౌకర్యాలను పెంచామని, గతంలో వైరస్ సోకే వరకు ఎదురుచూడకుండా ‘చేజ్ ద వైరస్’ వ్యూహంలో భాగంగా ముందుగానే టెస్టులు చేపట్టనున్నట్టు వివరించారు.

ముంబయిలో ఈ విధానం విజయవంతమైందని, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ ఈ స్ట్రాటజీని అమలు చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక వసతులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేశామని తెలిపారు. కరోనా మందులు రెమ్‌డెసివిర్, ఫావిపిరవిన్‌ల వినియోగానికి రాష్ట్రానికి కేంద్రం అనుమతినిచ్చిందని, ఈ డ్రగ్ తగిన మొత్తంలో సమకూరిన తర్వాత ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉంచుతామని వివరించారు. రాష్ట్రంలో సోమవారం ప్లాస్మా థెరపీ సెంటర్లను ప్రారంభించనున్నట్టు తెలిపారు. దేశంలోనే అత్యధిక ప్లాస్మా థెరపీలు చేసే ఫెసిలిటీ ఇక్కడే రూపొందే అవకాశమున్నదని అన్నారు. కాబట్టి ఇప్పటికే కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారు ముందుకొచ్చి వారి ప్లాస్మా అందించాల్సిందిగా కోరారు.

Advertisement

Next Story