- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేజ్రీ‘వాల్’ కమలం బ్రేక్!
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేశాయి. అధికార ఆప్‌కు దీటుగా కమలనాథులు ప్రచారం చేశారు. కమలం పార్టీ జాతీయ చీఫ్‌గా జె.పి.నడ్డా ఎన్నికైనప్పటికీ, ఇంకా హోం మంత్రి అమిత్ షా ఆయన్ను పూర్తిగా నమ్మినట్టు లేడు. అందుకే స్వయంగా అమిత్ షానే ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రచారం చేశాడు. బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు, విద్వేష ప్రసంగాలు, షహీన్ బాగ్ ప్రస్తావనలు, సీఏఏ వ్యతిరేక నినాదాలతో ఢిల్లీ ఎన్నికల పోరు హోరెత్తింది.
ఎవరి ధీమా వారిదే..
ఎన్నికల ప్రచారంలో జాతీయవాదం, సీఏఏ, ఎన్‌ఆర్‌సీ ప్రస్తావన తెచ్చేందుకే బీజేపీ మొగ్గు చూపింది. ఆప్ మాత్రం విమర్శల జోలికి వెళ్లకుండా అభివృద్ధి, ఐదేండ్ల కాలంలో చేసిన పనుల గురించి మాట్లాడింది. విద్యుత్, మహిళలకు ఉచిత రవాణా, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయల కల్పనలో తమ ప్రభుత్వ కృషి గురించి ఆప్ నేతలు ప్రజలకు వివరించారు. ఈ రెండు పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తే కాంగ్రెస్ నేతలు పెద్దగా ప్రచారం చేసినట్టు కనిపించలేదు. అయితే, బీజేపీ, ఆప్ నేతలు ఎవరికి వారు తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 48 సీట్లతో అధికారం చేజిక్కించుకుంటామని బీజేపీ ఢిల్లీ చీఫ్ మనోజ్ చెబుతుండగా, ఢిల్లీ ప్రజలకే షాకిచ్చే ఫలితాలొస్తాయంటూ అమిత్ షా చెబుతున్నారు. మరోవైపు ఆప్ అధికారం మళ్లీ తమదేనని ధీమా వ్యక్తం చేస్తోంది.
బీజేపీ ఎత్తులకు పైఎత్తులు వేయడంలో ఆప్ సరైన వ్యూహాలు అనుసరించిందని విమర్శకులు చెబుతున్నారు. మొదట్లో తనను తాను మోడీకి ప్రత్యర్థిగా చూపించుకునేందుకు అరవింద్ పోటీ పడేవారనీ, అందుకే వారణాసిలో సైతం మోడీకి వ్యతిరేకంగా బరిలో దిగారని కానీ, ఆ తర్వాత కాలంలో తన వైఖరి మార్చకున్నారని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. తరచూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, కేంద్రం వైఖరిని తప్పు పట్టే చర్యలు అరవింద్ చేసేవారనీ, కానీ, అవి తనకు సత్ఫలితాలివ్వవని భావించాడేమో తెలియదు కానీ, తర్వాత కాలంలో ఆ గొడవల జోలికి వెళ్లలేదు. జాతీయ అంశాలు ఎన్‌ఆర్‌సీ, సీఏఏల పట్ల ‘కేజ్రీ’ని బీజేపీ ఎంతో క్రేజీగా ప్రొవోక్ చేసినప్పటికీ ఆచి తూచి స్పందించారయన. తమ ఎజెండా అభివృద్ధి, మౌలిక సదుపాయల కల్పనేనని చెప్పారు.
పోలింగ్ ముందు రోజు ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ మాట్లాడుతూ, షహీన్‌బాగ్ తప్ప బీజేపీకి ఏది దొరకలేదనీ, అందుకే బీజేపీ షహీన్ బాగ్‌ను ప్రతి సారి తెర మీదకు తెస్తోందని అసహనం వ్యక్తం చేశారు. తాను ఐదేండ్ల పాటు ఢిల్లీలోని ప్రతి కుటుంబానికీ ఒక పెద్ద కొడుకుగా ఉండి ఏం చేయాలో..అదే చేశానని అది చూసే తనకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ గెలుపు బీజేపీకి చాలా ముఖ్యం!
ఢిల్లీలో బీజేపీకి గెలుపు చాలా ముఖ్యమని విమర్శకులు చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన కమలానికి దేశవ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటితే సానుకూలత వస్తుందని అంటున్నారు. లేదంటే..విపక్షాలు, ప్రాంతీయ పార్టీలు బలపడే అవకాశముంటుందని చెబుతున్నారు. ఇప్పటికే ప్రాంతీయ పార్టీలు జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలను పాలిస్తుండగా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇదొక్క కారణమే కాకుండా..ఈ ఏడాది చివరలో జరిగే బీహార్ ఎన్నికలు, వచ్చే ఏడాదిలో జరిగే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ఎన్నికలపై ఢిల్లీ ఎన్నికల ప్రభావం పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పైగా రాజ్యసభలో బీజేపీకి మెజార్టీ లేని విషయం తెలిసిందే.
రాజ్యసభలో విపక్షాలను కమలనాథులు ఎదుర్కోవాలంటే తప్పక బీహార్, వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించాల్సిందేననీ, కాబట్టే ఢిల్లీ ఎన్నికలను బీజేపీ అధిష్టానం అతి మఖ్యమైనదిగా తీసుకున్నదని సమాచారం. అయితే, బీజేపీ 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలోని లోకసభ స్థానాలు ఏడింటికి ఏడు గెలుచుకుంది కానీ, అసెంబ్లీలో ఓటమే చవి చూసింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాల్లో కేవలం 3 స్థానాల్లో కమలం ఖాతా తెరుచుకోగా, 67 స్థానాలను చీపురు ఊడ్చేసింది. బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ ఓటమి పాలయ్యారు. ఈ సారి కూడా 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం 2020లో అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్నాయి. మెజార్టీ సర్వేలు ఢిల్లీ పీఠం ఆప్ దేననీ చెబుతున్నప్పటికీ, తాము ఈ సారి తప్పక ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగురవేస్తామని కమలనాథులు చెబుతున్నారు. వారి ఆశలు నెరువేరుతాయో లేక అడియాసలవుతాయో చూడాలి.
నడ్డాకు పరీక్ష
బీజేపీ జాతీయ చీఫ్‌గా జె.పి.నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఆయనకు మొదటి అసెంబ్లీ ఎన్నికలు ఢిల్లీవే. అయితే, నడ్డా జాతీయ చీఫ్‌గా ఎన్నికైన తర్వాత తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ గతం కంటె ఎక్కువే పోలింగ్ శాతాన్ని పెంచుకుందనీ, తెలంగాణలో బీజేపీ బరిలో ఉందని ఆ పార్టీ తెలంగాణ చీఫ్ లక్ష్మణ్ తెలిపారు. మున్సి‘పోల్స్’కు అసెంబ్లీ పోరుకు తేడా ఉంది. పైగా రాష్ట్రాలు వేరు, ఎలక్షన్స్ కూడా వేరు కాబట్టి ఢిల్లీలో కమలం ఓటింగ్ పెరిగేనా, అధికారానికి సరిపడా సీట్లు వస్తాయా.. అన్నది తెలియాలంటే.. ఫిబ్రవరి 11 వరకు వేచి చూడాల్సిందే.