Janwada Farm House : మోకిలా పోలీస్ స్టేషన్ లో విజయ్ మద్దూరి

by Y. Venkata Narasimha Reddy |
Janwada Farm House : మోకిలా పోలీస్ స్టేషన్ లో విజయ్ మద్దూరి
X

దిశ, వెబ్ డెస్క్: జన్వాడ ఫామ్ హౌస్ (Janwada Farm Hous) కేసులో విజయ్ మద్దూరి(Vijay Madduri) మోకిలా పోలీసుల(Mokila Police Station) విచారణకు హాజరయ్యారు. తన లాయర్లను వెంటపెట్టుకొని విజయ్ మద్దూరి విచారణకు హాజరయ్యేందుకు మోకిలా పోలీస్ స్టేషన్ కు వచ్చారు. జన్వాడ ఫాంహౌస్ కేసులో పట్టుబడిన విజయ్ మద్దూరికి డ్రగ్స్ పాజిటివ్ రావడం కలకలం రేపింది. జన్వాడ ఫాంహౌస్ పై దాడి సందర్భంగా పోలీసులు అదుపులో తీసుకున్న విజయ్ తన ఫోన్ ను మాయం చేయడం పోలీసులకు సవాల్ గా మారింది. ఈ కేసులో ఏ1గా రాజ్ పాకాల(Raj Pakala), ఏ2గా విజయ్ మద్దూరి, ఏ3గా ఫామ్ హౌస్ మేనేజర్ కార్తీక్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే కేసులో విజయ్ మద్దూరి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామమరిది ఫామ్ హౌస్ యజమాని రాజ్ పాకాలను మోకిలా పోలీసులు విచారించారు. విచారణ అనంతరం బీఎన్ఎస్ సెక్షన్ 35(3) కింద మోకిల పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. అలాగే రాజ్ పాకాల మొబైల్‌ను సీజ్ చేశారు.

ఇదే కేసులో పట్టుబడిన విదేశీ మద్యం, అనుమతి లేని మద్యంకు సంబంధించిన కేసులో రాజ్ పాకాలను, విజయ్ లను ఇప్పటికే చేవెళ్ల ఎక్సైజ్ పోలీసులు కూడా విచారించారు. అక్రమ మద్యం వినియోగం కేసులో పాకాల ఏ2గా ఉన్నాడు. ఇదే కేసులో ఏ3గా ఉన్న నాగేశ్వర్ రెడ్డిని కూడా ప్రశ్నించారు. జన్వాడలో ఫామ్‌హౌస్‌పై ఇటీవల సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇక్కడి రిజర్వ్‌ కాలనీలో ఫామ్‌హౌస్‌ యజమాని రాజ్‌ పాకాల రాత్రి పార్టీ నిర్వహించారు. తనిఖీలు చేపట్టిన పోలీసులు 21 మంది పురుషులు, 14 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 35 మందితో నిర్వాహకులు మద్యం పార్టీ నిర్వహించారు. దీంతో డ్రగ్స్​టెస్టు నిర్వహించి పోలీసులు రాజ్‌ పాకాల స్నేహితుడు విజయ్‌ మద్దూరి కొకైన్‌ తీసుకున్నట్లు నిర్ధారించారు. ఈ మేరకు ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story