Uppal- Narapalli Fly Over: ఉప్పల్- నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులకు మోక్షం

by Maddikunta Saikiran |
Uppal- Narapalli Fly Over: ఉప్పల్- నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులకు మోక్షం
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్(HYD) నుంచి యాదాద్రి(Yadadri), వరంగల్(Warangal) మార్గంలో ఏళ్ల తరబడి పెండింగులో ఉన్న ఉప్పల్- నారపల్లి(Uppal- Narapalli) ఎలివేటెడ్ కారిడార్ ఫ్లై ఓవర్ పనులకు మోక్షం లభించింది. నెల రోజుల్లోగా ఫ్లై ఓవర్ పనులు ప్రారంభించకపోతే టెండర్ రద్దు చేస్తామని గాయత్రి కన్‌‌స్ట్రక్షన్స్ ను సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ మొదటి వారంలో హెచ్చరించడంతో ఫ్లై ఓవర్ పనులను కంపెనీ తిరిగి ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి యాదాద్రి భువనగిరి, వరంగల్ మార్గంలో రద్దీని తగ్గించేందుకు ఉప్పల్-నారపల్లి ఫ్లై ఓవర్ ను నిర్మిస్తున్నారు. మొత్తం ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని 2018లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రారంభించాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి మేడిపల్లి, నాచారం, పీర్జాదిగూడ వరకు సుమారు 7 కిలోమీటర్ల మేర ఈ ఫ్లై ఓవర్‌ నిర్మించనున్నారు. సుమారుగా రూ.600 కోట్లతో చేపట్టిన ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం నిబంధనల ప్రకారం 2020 జూలైలో పూర్తి చేయాల్సి ఉంది. అయితే వివిధ కారణాలతో పనులు ముందుకు సాగలేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ శివారు రోడ్లపై ప్రధానంగా దృష్టి సారించింది. యాదాద్రి, వరంగల్ మార్గంలో ఆరేళ్లుగా పెండింగ్లో ఉన్న రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆ కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో నారపల్లిలోని సీపీఆర్‌‌‌‌ఐ దగ్గర సర్వీస్ రోడ్డు పనులను కంపెనీ ప్రారంభించింది. ఈ రోడ్డు మీదుగా ట్రాఫిక్‌‌ను అనుమతిస్తూనే ఫ్లై ఓవర్ పనులను రాత్రి వేళల్లో చేపట్టనున్నారు. అంతే కాకుండా అనంతరం ర్యాంప్ నిర్మాణం, పిల్లర్ల పనులను కూడా చేపట్టనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో 2018లో ఈ ఫ్లై ఓవర్ పనులు ప్రారంభించగా.. ఇప్పటికీ కేవలం 44 శాతం పనులు మాత్రం పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ పిల్లర్లు పూర్తి చేసి శ్లాబులు వేయాల్సి ఉందని, మొత్తంగా 147 శ్లాబ్‌‌లు వేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు కేవలం 37 మాత్రమే పూర్తయినట్లు తెలిపారు. 2025 ఏడాది జనవరి నుండి ఏడాదిన్నరలోగా ఈ పనులను మొత్తం పూర్తి చేయాలని ఈ మేరకు ఆర్ అండ్ బీలోని ఎన్‌‌హెచ్‌‌ఏఐ అధికారులు కంపెనీకి గడువు విధించటంతో పనులు ఇక శరవేగంగా పూర్తి చేసే అవకాశం ఉందని సమాచారం.

మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలతో..

ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులపై రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komati Reddy Venkat Reddy) తన చాంబర్లో అధికారులతో ఇటీవల సమీక్షించారు. రెండు నెలల్లో కనీసం ఒక స్లాబ్‌ పనులైనా పూర్తి చేయాలని సూచించారు. ఈ మేరకు కేంద్ర రహదారులు, రవాణా శాఖ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్, ఎస్‌ఈ ధర్మారెడ్డిలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. చాలా ఏళ్లుగా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు పెండింగ్‌లో ఉన్నాయని.. అంసపూర్తి పనులతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఏడాదిన్నర లోగా ప్రాజెక్టు పనులు పూర్తిచేసి వాహనదారులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. దీంతో అధికారుల ఆదేశంతో సదరు కంపెనీ నిర్మాణ పనుల్లో వేగం పెంచనుంది.

Advertisement

Next Story

Most Viewed