పొన్నం, శ్రీధర్ బాబుకు హ్యాండ్ ఇచ్చారు.. కారణం అదేనా?

by Sridhar Babu |   ( Updated:2021-06-27 08:08:07.0  )
Ponnam-Prabhakar-and-Sridha
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : 1999 నుంచి ఆ ఇద్దరిది ఒకే మాటా ఒకే బాట. జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో వారు చెప్పిందే వేదం, చేసిందే శాసనం. సీనియర్లైనా, జూనియర్లైనా సరే వారిద్దరి కేంద్రీకృతంగానే రాజకీయాలు జరపాలన్న పరిస్థితి తయారు చేసుకున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అయితే.. అటు అధికార యంత్రాంగాన్ని, ఇటు పార్టీని ఒంటి చేత్తో నడిపించారు. దాదాపు దశాబ్దన్నర కాలంగా అన్నీ తామై నడిపించిన ఈ ఇద్దరి మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. ఇప్పుడు వారిద్దరూ ఎడ మొహం పెడ మొహం అన్నట్టుగానే ఉంటున్నారు. కానీ, అధిష్టానం మాత్రం ఆ ఇద్దరినీ ఒకే సారి పక్కనపెట్టేయడంతో జిల్లాలో చర్చకు దారి తీసింది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లకు శనివారం ప్రకటించిన పీసీసీ కమిటీలో ఎలాంటి పదవులు కట్టబెట్టకపోవడం గమనార్హం. ఉత్తమ్ టీంలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పని చేసిన పొన్నం ప్రభాకర్, ఉపాధ్యక్షునిగా వ్యవహరించిన దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు రేవంత్ టీంలో మాత్రం ఎలాంటి పదవిని కట్టబెట్టలేదు. యాధృచ్చికంగా అధిష్టానం తీసుకున్న నిర్ణయమే అయినా ఒకప్పటి మిత్రులకు ఒకే సారి పదవులు రాకపోవడం మాత్రం వారి అనుచరులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దశాబ్దాల పాటు పార్టీలో కొనసాగుతున్నా వీరిపై ఏఐసీసీ శీతకన్ను ఎందుకు వేసిందోనన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆ ప్రచారమే కొంప ముంచిందా.?

కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అధికార టీఆర్ఎస్ పార్టీలోని కీలక వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారన్న ప్రచారం వీరిద్దరిపైనా సాగింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత తమతో ప్రభుత్వంలోని పెద్దలు టచ్‌లో ఉన్నారని సన్నిహితులతో చెప్పుకోవడంతో పాటు కాంగ్రెస్‌లో కోవర్టులే ఎక్కువ అన్న ప్రచారం కూడా వీరిద్దరికి నష్టం కలిగించిందని తెలుస్తోంది. ఏఐసీసీ స్థాయిలో ఫిర్యాదుల పరంపర కూడా కొనసాగినట్టు తెలుస్తోంది. శ్రీధర్ బాబుకు పీసీసీ ఇస్తే ఐఏఎస్ ఆఫీసర్‌గా ఉన్న ఆయన భార్య ద్వారా పార్టీని కేసీఆర్ కుటుంబం కాళ్ల ముందు ఉంచుతారని అధిష్టానానికి లీకులు ఇచ్చినట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో పొన్నం ప్రభాకర్ కూడా టీఆర్ఎస్ మెయిన్ లీడర్స్‌తో టచ్‌లో ఉన్నాడని, హుజురాబాద్ బై పోల్‌లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు సీక్రెట్‌గా కేటీఆర్‌ను మీట్ అయ్యాడని కూడా అధిష్టానానికి సమాచారం చేరవేసినట్టు తెలిసింది. ఈ కారణంగానే ఇద్దరికీ కీలక బాధ్యతలు అప్పగించేందుకు ఏఐసీసీ విముఖత చూపి ఉంటుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

సీనియర్లకు రేవంత్ చెక్..

పార్టీలో దశాబ్దాలుగా కొనసాగుతున్నామని, తామే సీనియర్లమంటూ తరుచూ కామెంట్ చేస్తూ తమకు ప్రాధాన్యం ఉండాలన్న డిమాండ్‌తో ఉండే సీనియర్లకు కూడా ఏఐసీసీ షాకిచ్చింది. మూడున్నరేళ్ల క్రితం పార్టీలో చేరిన రేవంత్ ఏకంగా పీసీసీ పదవిని కొట్టేయడంతో సీనియర్లు, జూనియర్లు అన్న నినాదంతో కాలం వెల్లదీసిన వారు ఇక నుంచి ఆ మాటను పక్కనపెట్టెయాల్సిన పరిస్థితి ఎదురైంది.

ఏఐసీసీ పోస్టులపై ఆశలు..

త్వరలో తమ నాయకులకు ఏఐసీసీలో పదవులు కట్టబెడతారేమోనని సెకండ్ కేడర్ ఆశిస్తోంది. ఢిల్లీ స్థాయిలో వీరికి ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకుని తప్పకుండా తమ వారికి ఏదో ఒక పదవి వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed