యువ ఆటగాళ్ల కోసం SRH అన్వేషణ

by Shyam |
యువ ఆటగాళ్ల కోసం SRH అన్వేషణ
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 13వ సీజన్ తొలి అర్ద భాగంలో గెలుపోటముల మధ్య ఊగిసలాడినా.. చివర్లో మాత్రం వరుస మ్యాచ్‌లు గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు చేరింది. క్వాలిఫయర్-2లో బౌలింగ్ వైఫల్యం కారణంగా భారీ స్కోర్ ఇవ్వడంతో ఛేదనలో విఫలమైంది. ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ జట్టు 8 మ్యాచ్‌లు ఆడి ఎనిమిదింటిలో ఓడిపోయింది. ప్రతీ ఏడాది కూడా సన్‌రైజర్స్ ప్రదర్శన ఇలాగే కొనసాగుతున్నది. గత ఐదు సీజన్లలో ప్లేఆఫ్స్ చేరిన రికార్డు ఉన్నా.. విజయాలు మాత్రం 50 శాతానికి మించడం లేదు. దీంతో రాబోయే సీజన్‌కు సన్‌రైజర్స్ జట్టును పూర్తి స్థాయిలో కాకపోయినా పాక్షికంగా ప్రక్షాళన చేయాలని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం.

ఇవీ కారణాలు..
సన్‌రైజర్స్ టీమ్ ఈ సారి ఆటగాళ్ల గాయాల కారణంగా సతమతమయ్యింది. మిచెల్ మార్ష్, భువనేశ్వర్ కుమార్, విజయ్ శంకర్ వంటి కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా సీజన్ మొత్తానికి దూరం కావడంతో బౌలింగ్ విభాగం బలహీనపడింది. వెస్టిండీస్ ప్లేయర్ జేసన్ హోల్డర్‌ జట్టులో చేరిన తర్వాతే బౌలింగ్ విభాగంలో సమతుల్యం వచ్చింది. అయితే అతడిని రెగ్యులర్‌గా ఆడించాల్సి రావడంతో మహ్మద్ నబీకి సీజన్ మొత్తం అవకాశం రాలేదు. సన్‌రైజర్స్ జట్టులో కెప్టెన్ సహా టాప్ ఆర్డర్‌లో కీలకంగా విదేశీ క్రికెటర్లే ఉంటున్నారు. జట్టులో నలుగురి కంటే ఎక్కువ విదేశీయులు ఉండే అవకాశం లేకపోవడంతో నబీ వంటి ఆటగాళ్లకు తుది జట్టులో చోటు దక్కలేదు. మరోవైపు మనీష్ పాండే తప్ప అనుభవమున్న భారతీయ క్రికెటర్లు లేకపోవడం మిడిల్ ఆర్డర్ బలహీనపడటానికి కారణమయ్యింది.

వీళ్లను వదిలించుకుంటారా?
వచ్చే సీజన్ కోసం ఇప్పటి నుంచే సన్‌రైజర్స్ యాజమాన్యం కసరత్తు ప్రారంభించింది. జానీ బెయిర్‌స్టో, మహ్మద్ నబి, ఖలీల్ అహ్మద్, ఫాబియన్ అలెన్‌లను విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఓపెనర్‌గా సాహా రాణిస్తుండటం.. నాలుగో నెంబర్‌లో కేన్ విలియమ్‌సన్ కుదురుకోవడంతో బెయిర్‌స్టో అవసరం లేదని అనుకుంటున్నది. మరోవైపు ఫాబియన్ అలెన్ గాయం కారణంగా ఈ సీజన్ ఆడలేదు. ఖలీల్ అహ్మద్ వికెట్లు తీస్తున్నా.. పరుగులు ధారాళంగా ఇస్తుండటం పెద్ద సమస్యగా మారింది. కాబట్టి ఆ నలుగురి విడుదల చేసి.. కొత్తగా భారతీయ క్రికెటర్లను తీసుకోవాలని అనుకుంటున్నది. యువ క్రికెటర్లు, అనుభవజ్ఞులైన భారతీయులను తీసుకుంటే తుది జట్టు కూర్పులో సమస్యలు ఉండవని కోచింగ్ స్టాఫ్ కూడా భావిస్తోంది. ఇప్పుడు ఉన్న విదేశీ క్రీడాకారులతో పాటు కొత్తగా స్థానికులను తీసుకోవడం వల్ల జట్టు సమతుల్యంగా మారుతుందని.. అప్పుడు పిచ్‌లకు తగ్గట్లుగా జట్టు మార్పు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. బీసీసీఐ మెగా వేలం ప్రకటించేలోగా ఒక రూట్ మ్యాప్ సిద్దం చేయడానికి యాజమాన్యం కసరత్తు ప్రారంభించింది.

Advertisement

Next Story