ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ?

by Anukaran |   ( Updated:2020-07-07 22:10:45.0  )
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ?
X

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడున్నారో, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియజేయాలని కోరుతో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిలను ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా చేరుస్తూ నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియజేయాలని కోరారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌లో 30 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌజ్‌కు వెళ్ళిపోయారంటూ పత్రికల్లో, టీవీ ఛానెళ్ళలో వార్తలు వచ్చాయని, చాలా మంది ప్రజలు సీఎం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందోనని ఆందోళన చెందుతున్నారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాత్రమే కాకుండా దీర్ఘకాల స్వప్నమైన రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన నేత అని పేర్కొన్నారు.

దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాల ప్రారంభం రోజున, జూన్ 28వ తేదీన, ముఖ్యమంత్రి కేసీఆర్ చివరిసారిగా ప్రజలకు కనిపించారని, సుమారు వంద మంది ఆ కార్యక్రమంలో పాల్గొన్నారని, మాస్కు లేకుండానే కనిపించారని, అందువల్ల ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందోనన్న ఆందోళన కలుగుతోందని పేర్కొన్నారు. ఆ కార్యక్రమానికి మూడు రోజుల ముందు, జూన్ 25న, హరితహారం కార్యక్రమంలో సైతం కేసీఆర్ పాల్గొన్నారని, అందులో కూడా సుమారు 100 మంది ఉన్నారని, అప్పుడు కూడా మాస్కు లేకుండానే కనిపించారని ప్రస్తావించారు.

అప్పటి నుంచి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉందని, ప్రగతి భవన్‌లో సైతం నమోదయ్యాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ 64 ఏళ్ళ వయసులో ఉన్నందున ఆయన గత పదిరోజులుగా ఎక్కడున్నారో, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అధికారికంగా ప్రభుత్వం తరఫున అధికారులెవరూ తెలియజేయడంలేదని పేర్కొన్నారు. రాష్ట్ర పౌరునిగా, ఓటరుగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియక ఆందోళన చెందుతున్నానని, ప్రభుత్వ పెద్దగా ముఖ్యమంత్రి హోదాలో అనేక కీలకమైన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నందున ఈ రాష్ట్ర ఓటర్లను ఆందోళనలో పెట్టకుండా ఆయన ఆచూకీని తెలియజేయడంతో పాటు ఆరోగ్య పరిస్థితి పట్ల కూడా వివరాలు అందజేసేలా సంబంధిత ప్రభుత్వ అధికారులను హైకోర్టు ఆదేశించాలని ఆ పిటిషన్‌లో మల్లన్న కోరారు.

Advertisement

Next Story