అలిగి ఇంటి నుంచి పారిపోయిన బాలుడు.. పట్టించిన వాట్సప్

by Anukaran |   ( Updated:2021-10-19 04:42:12.0  )
అలిగి ఇంటి నుంచి పారిపోయిన బాలుడు.. పట్టించిన వాట్సప్
X

దిశ, అశ్వారావుపేట టౌన్: వాట్సప్ గ్రూప్ లు అంటే తప్పుడు సమాచారానికి, వెకిలి జోకులకు, అసత్య ప్రచారాలకు కేంద్ర బిందువులుగా మారాయనే అపవాదు మూటగట్టుకున్న తరుణంలో.. అదే వాట్సప్ ఇంటి నుంచి అలిగి వెళ్లిపోయిన బాలుడిని తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేర్చింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట కేంద్రంగా ఏర్పాటుచేసిన ZPTC అశ్వారావుపేట వాట్సప్ గ్రూపు ఇందుకు వేదికయ్యింది. పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి గ్రామానికి చెందిన కుప్పల సుబ్బారావు, దమయంతి దంపతుల కుమారుడు కుప్పల చరణ్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఆ బాలుడికి స్కూల్ కి వెళ్లడం ఇష్టం లేదు. అయితే బాలుడి భవిష్యత్తు దృష్ట్యా తల్లిదండ్రులు బలవంతంగా స్కూలుకు పంపించారు. అయితే స్కూలుకు వెళ్లడానికి ఇష్టపడని బాలుడు సోమవారం మధ్యాహ్నం సమయంలో సైకిల్ వేసుకొని స్కూల్ నుండి పరారయ్యాడు. జీలుగుమిల్లి, అశ్వారావుపేట, దమ్మపేట మీదుగా సుమారు 35 కిలోమీటర్లు ప్రయాణించి రాత్రి సమయంలో దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో దాహం వేయడంతో మంచినీళ్లు తాగేందుకు జగన్నాధ నరేంద్ర రజిని అనే దంపతుల ఇంటికి వెళ్ళాడు.

బాలుడి తీరు చూసి అనుమానం వచ్చిన దంపతులు ఆరా తీశారు. పొంతన లేని సమాధానాలు చెప్తూ తనది అశ్వారావుపేట దగ్గరలోని ఊరు అని తెలిపాడు. దీంతో బాలుడికి రాత్రి వారి ఇంట్లో ఆశ్రయం కల్పించారు. తర్వాత బాలుడి వీడియో, ఫోటోలను వాట్సప్ ద్వారా అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామంలో ఐకేపీ సీసీ విధులు నిర్వహించే బంధువు చిర్నేని సత్తిబాబుకు పంపించారు. బాలుడు ఫొటోతో ఉన్న సమాచారాన్ని చిర్నేని సత్తిబాబు పలు వాట్సప్ గ్రూప్ లలో పోస్ట్ చేశారు. ZPTC అశ్వారావుపేట వాట్సప్ గ్రూపులో సభ్యుడిగా ఉన్న అశ్వారావుపేటకు చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ కలకొండ హేమ జగదీష్, తన తోటి ఎలక్ట్రీషియన్ తాటియాకులగూడెం గ్రామానికి చెందిన శేఖర్ బాలుడి ఆచూకీ తెలపండి అని పెట్టుకున్న వాట్సప్ స్టేటస్ లో ఫోటోకి, గ్రూప్ లో వచ్చిన ఫోటోకి పోలిక దగ్గరగా ఉండడంతో.. వెంటనే కలకొండ హేమ జగదీష్ బాలుడి తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ తో ఉన్న శేఖర్ వాట్సప్ స్టేటస్ ను స్క్రీన్ షాట్ తీసి ZPTC అశ్వారావుపేట వాట్సప్ గ్రూప్ లో పోస్ట్ చేశాడు.

దీంతో చిర్నేని సత్తిబాబు బాలుడి తండ్రికి ఫోన్ చేసి బాలుడు ముష్టిబండలోని తమ బంధువుల ఇంటి వద్ద క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందించి, ముష్టిబండలోని బంధువులు ఇంటి వద్ద నుండి బాలుడిని తీసుకువచ్చి అశ్వారావుపేటలో తండ్రికి అప్పగించాడు. ఈ సందర్భంగా బాలుడు తండ్రి సుబ్బారావు తన బిడ్డకి ఆశ్రయం కల్పించిన జగన్నాధ నరేంద్ర, రజిని దంపతులకు, వాట్సాప్ లో పోస్ట్ చేసిన చిర్నేని సత్తిబాబు, స్టేటస్ పెట్టుకున్న శేఖర్ కు, అందుకు స్పందించిన కలకొండ హేమ జగదీష్ కు, ZPTC అశ్వారావుపేట వాట్సప్ గ్రూపు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపాడు.

Advertisement

Next Story