ప్రకృతితో ప్రయాణం @‘విస్టాడోమ్ కోచ్’

by Sujitha Rachapalli |   ( Updated:2021-01-18 05:13:47.0  )
ప్రకృతితో ప్రయాణం @‘విస్టాడోమ్ కోచ్’
X

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని గిరిజన ప్రాంతమైన కేవాడియాకి పర్యాటకాన్ని ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎనిమిది రైళ్లను ప్రధాని మోడీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ ఎనిమిది రైళ్లలో అహ్మదాబాద్-కెవాడియాకు చెందిన జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ ట్రైన్‌లో ప్రత్యేకంగా ‘విస్టాడోమ్‌ కోచ్‌’లు ఉండటమే అందుకు కారణం. కోచ్‌ కిటీకీలు, తలుపులే కాకుండా పైభాగాన్ని కూడా అద్దాలతోనే తీర్చిదిద్దారు. ప్రయాణికులకు అత్యంత మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని అందించడంతో పాటు, పరిసరాలను, ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు..ఇండియన్ రైల్వే తయారు చేసిన అత్యాధునిక కోచ్ ‘విస్టాడోమ్’ ప్రత్యేకతలు మీకోసం..

చిన్నారుల నుంచి పెద్దొళ్ల వరకు ప్రయాణం(బస్, ట్రైన్, కారు)లో ‘కిటికీ’ పక్కన కూర్చోవడానికి పోటీ పడుతుంటారు. చల్లగా వీస్తున్న గాలితో కబుర్లు చెబుతూ, మనసుకు నచ్చిన పాటల వింటూ, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ తమ జర్నీని స్వీట్ మెమొరీగా మార్చుకుంటారు. అందుకు ‘విండో సీట్’ దొరికితేనే టికెట్స్ బుక్ చేసేవాళ్లు ఎందరో. మరి అందరికీ విండో సీట్ దొరకడం కష్టం కదా. అందుకే ఇండియన్ రైల్వే విస్టాడోమ్ కోచ్‌ను తయారుచేసింది. ఈ కోచ్‌లో విండో పక్కనే కాకుండా ఎక్కడ కూర్చున్నా ప్రకృతిని ఆస్వాదించేలా పెద్ద పెద్ద అద్దాల కిటీకీలను అమర్చారు. కోచ్‌ ముందు నిలబడగానే ఆటోమేటిక్‌గా ఓపెన్ అయ్యే స్లైడింగ్ డోర్స్, పనోరమిక్ వ్యూ అందించే గ్లాస్ రూఫ్ టాప్స్, 180 డిగ్రీల్లో టర్న్ చేసే సీట్లు, వైఫైతో ప్యాసింజర్ కోరుకునే కంటెంట్..వెరసి విస్టాడోమ్ కోచ్‌లో ప్రయాణం ప్రయాణీకులకు ఓ సరికొత్త అనుభూతినిస్తోంది.

ఫోల్డబుల్ స్నాక్ టేబుల్స్, బ్రెయిలీ భాషలో సీట్ నెంబర్స్, డిజిటల్ డిస్‌ప్లే స్క్రీన్స్, స్పీకర్స్, జీపీఎస్ ఆధారిత ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్, మినీ ప్యాంట్రీ, కాఫీ మేకర్, వాటర్ కూలర్, హాట్ ఒవెన్, రిఫ్రిజిరేటర్, సెపరేట్ మల్టీ టైర్ లగేజ్ కంపార్ట్‌మెంట్ వంటి సకల సౌకర్యాలు విస్టాడోమ్ కోచ్‌లో ఉన్నాయి. అంతేకాదు ట్రైన్ స్టాఫ్ కోసం ఓ ప్రత్యేక క్యాబిన్ ఉండగా, ప్రతి రైడ్‌లో వచ్చే ప్రయాణికులకు కోచ్ గురించి స్టాఫ్ వివరిస్తారు. సీసీటీవీ సర్వైలైన్స్ కూడా ఉండగా, ఫైర్ అలారమ్ సిస్టమ్‌తో పాటు, ఎల్‌ఈడీ డెస్టినేషన్ బోర్డ్ అందుబాటులో ఉంది. మొత్తంగా ప్రతి విస్టాడోమ్ కోచ్‌లో 44 సీట్లు ఉండగా, రిజర్వేషన్ సీటు ధర రూ. 885గా నిర్ణయించారు. సాధారణంగా రైళ్లలో దుర్వాసనతో పాటు, ఎక్కడపడితే అక్కడ చెత్త, చాలా బ్యాడ్ అంబీయన్స్ కనిపిస్తుందని, కానీ, విస్టాడోమ్ కోచ్‌లో ప్రయాణం..విమానం ప్రయాణాన్ని తలపించేలా ఉందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. ఈ ట్రైన్‌‌లో వైబ్రేషన్స్ లేవని, చాలా స్మూత్‌గా, సాఫీగా ప్రయాణం సాగుతుందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed