వైజాగ్ కేర్ ఆస్పత్రిలో ఏం జరిగింది?.. అవయవాలు అమ్ముకున్నారా?

by srinivas |
వైజాగ్ కేర్ ఆస్పత్రిలో ఏం జరిగింది?.. అవయవాలు అమ్ముకున్నారా?
X

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ వైద్య రాజధాని విశాఖపట్టణంలోని కేర్ ఆస్పత్రిలో చోటుచేసుకున్న సంఘటన అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆస్పత్రులు వైద్యం పేరిట అవయవాల వ్యాపారం చేస్తున్నాయా? మొన్న వైజాగ్‌లోని ‘శ్రద్ధ’ ఆస్పత్రిలో కిడ్నీ ముఠా గుట్టు రట్టైతే ఇప్పుడు ‘కేర్’ ఆస్పత్రిలో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ వైజాగ్‌లోని ఆస్పత్రుల్లో ఏం జరుగుతోంది? బ్రెయిన్ డెడ్ ముసుగులో అక్రమ అవయవ వ్యాపారం నడుస్తుందా?.. ఇంతకీ జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే…

2016 డిసెంబర్ 13వ తేదీన ఒడిశాలోని గంజాం జిల్లా హరిపురం పోస్టు జాగాపూర్ గ్రామానికి చెందిన కడియాల సహదేవ్ (32) పనిమీద ఏపీకి వచ్చాడు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని మణికంఠ ధియేటర్ వద్ద ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చేరాడు. పరిస్థితి విషమించడంతో అతనిని వైజాగ్‌లో రామ్‌నగర్‌లోని కేర్ ఆస్పత్రిలో చేర్చారు. దీనిపై ఇచ్చాపురం పోలీసులు క్రైమ్ నెంబర్ 241/2016 సెక్షన్ 304(ఏ) కింద కేసు నమోదు చేశారు.

ఐదు రోజుల చికిత్స తరువాత అంటే డిసెంబర్ 19న సహదేవ్ మరణించాడు. బిల్లు చెల్లించనిదే శవం కదిలేదని లేదని ఆస్పత్రి బీష్మించుకుని కూర్చుంది. పేద కుటుంబమని చెల్లించలేమని చేతులెత్తేయడంతో…’ జీవన్ దాన్’ పేపర్లపై సంతకం చేస్తే అతని శరీరంలో అవయవాలు తీసుకుంటామని, బిల్లు చెల్లించక్కర్లేదని హాస్పిటల్ చెప్పింది. దీంతో హాస్పిటల్ చెప్పిన చోటల్లా అతని బంధువు గోవింద పాత్రో సంతకాలు చేశారు.

దీంతో సహదేవ్ శరీరంలోంచి రెండు కిడ్నీలు, లివర్, రెండు కార్నియాలు తీసేసుకున్నారు. అనంతరం విషయం తెలియని కుటుంబ సభ్యులు దహనసంస్కారాలు నిర్వహించి అంత్యక్రియలు పూర్తి చేశారు. అనంతరం తన భర్త ప్రమాదానికి గురయ్యారంటూ మృతుని భార్య లక్ష్మీయమ్మ దరఖాస్తు చేశారు. ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు పోస్టు మార్టం రిపోర్ట్ అడిగారు. దీంతో ఆమె దానిని వారికి ఇచ్చారు.

దానిని చూసిన ప్రతినిధులు అవాక్కయ్యారు. శరీరంలో అవయవాలు లేకపోవడంతో ఇన్సూరెన్స్ రాదని తేల్చిచెప్పారు. దీంతో లక్ష్మీయమ్మకు విషయం అర్ధమైంది. దీంతో ఆమె మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. దీంతో ఎన్‌హెచ్ఆర్సీ విశాఖ పోలీస్ కమీషనర్‌ని సమగ్ర విచారణ జరపాలంటూ ఆదేశించింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఇలా జరిగిందని నివేదిక పంపారు. ఈసారి పోలీసుల తీరుపై కూడా దర్యాప్తు చేయాలంటూ ఎన్‌హెచ్ఆర్సీ కమిషనర్‌ను ఆదేశించింది. దీంతో వైజాగ్‌ డీసీపీ రంగారెడ్డిని రంగంలోకి దించారు.

రికార్డులన్నీ పరిశీలించారు. మృతుని భార్య సంతకం లేకుండా మృతుని శరీరం నుంచి అవయవాలు తీసుకున్నట్టు నిర్ధారణ కావడంతో గతంలో దర్యాప్తు చేసిన ఎస్సై గణపతిరావుకి ఛార్జీ మెమో పంపారు. ఆస్పత్రిపై ఏపీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్ యాక్ట్ కింద కేసుల నమోదు చేశారు. నాలుగేళ్ల కిందట దుశ్చర్య బయటపడడంతో ఆస్పత్రి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. తాజా ఘటన నేపథ్యంలో ఏపీలో ఆస్పత్రుల్లో వైద్యం ముసుగులో చీకటి దందాలు జరుగుతున్నాయని నిర్ధారణ అవుతోంది. ముక్కుపిండి వసూలు చేసే ఆస్పత్రుల అసలు రంగులు బయటపడుతున్నాయని వైజాగ్ వాసుల పేర్కొంటున్నారు.

tags: ap, care hospital, nhrc, dead, human organ transplantation trafficking, vizag

Advertisement

Next Story