Congress: కేంద్రమంత్రి వర్సెస్ శశిథరూర్.. సోరోస్ తో పార్టీ విషయంపై మాటల యుద్ధం

by Shamantha N |
Congress: కేంద్రమంత్రి వర్సెస్ శశిథరూర్.. సోరోస్ తో పార్టీ విషయంపై మాటల యుద్ధం
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా వ్యాపారవేత్త జార్జ్‌ సోరోస్‌ (George Soros)తో కాంగ్రెస్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఆరోపణలు గుప్పిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో యూఎస్‌లో 2009లో ఏర్పాటుచేసిన విందుకు సంబంధించిన ఆహ్వానితుల జాబితాలో జార్జ్‌ సోరోస్‌ పేరును కాంగ్రెస్‌ ఎంపీ, నాటి విదేశాంగ సహాయమంత్రి శశిథరూర్ (Shashi Tharoor) చేర్చారని కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్ పూరి (Hardeep Singh Puri) పేర్కొన్నారు. ఆ సమయంలో తాను ఐక్యరాజ్యసమితిలో శాశ్వత ప్రతినిధిగా ఉన్నట్లు వెల్లడించారు. కాగా.. కేంద్రమంత్రి వ్యాఖ్యలను శశిథరూర్ ఖండించారు. ‘‘కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పూరి చెబుతోంది నాకు గుర్తున్న సమాచారానికి భిన్నంగా ఉంది. 2009లో వివిధ దేశాల్లోని ముఖ్య నేతలు, వ్యక్తుల పేర్లను సేకరించి వారికి ఆహ్వానం పంపాం. అప్పుడు సోరోస్‌ ఓ బిజినెస్ మ్యాన్ గానే తెలుసు. ఆయనకు భారత్‌లోని ఏ సంస్థతో సంబంధం ఉందో నాకు పూర్తిగా తెలియదు. దానిగురించి ఆయనతో ఎన్నడూ చర్చించలేదు. ఆ సమావేశంలో గ్లోబల్‌ వార్మింగ్‌కు పశ్చిమదేశాలదే బాధ్యత అని భారత ప్రభుత్వం ఆరోపించింది. అయితే దానికి ఆయన అభ్యంతరం తెలిపారు. అది మాత్రమే గుర్తుంది’’ అని శశిథరూర్‌ సోషల్‌ మీడియాలో చెప్పుకొచ్చారు.

జార్జ్ సోరోస్ తో కాంగ్రెస్ కు సంబంధాలు

ఇకపోతే, కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీకి, ‘జార్జ్‌ సోరోస్‌ ఫౌండేషన్‌’ నుంచి నిధులు పొందిన సంస్థకు సంబంధం ఉందని ఇటీవలే బీజేపీ ఆరోపణలు చేసింది. దీనిపైన, బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అంతేకాకుండా, సోరోస్‌ తమకు పాత మిత్రుడని తెలుపుతూ 2009లో కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ సోషల్‌ మీడియాలో చేసిన ఓ పోస్ట్‌ వైరల్ గా మారింది. దీనిపై కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్ పురి స్పందిస్తూ సోరోస్‌తో కాంగ్రెస్‌ నేతలకు సన్నిహిత సంబంధాలున్నాయని.. అప్పట్లో అమెరికాలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి అతడిని డిన్నర్‌కు సైతం ఆహ్వానించారని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed