ISRO-ESA: వ్యోమగాముల శిక్షణకు సహకారం.. ఇస్రో, ఈఎస్ఏ మధ్య కీలక ఒప్పందం

by vinod kumar |
ISRO-ESA: వ్యోమగాముల శిక్షణకు సహకారం.. ఇస్రో, ఈఎస్ఏ మధ్య కీలక ఒప్పందం
X

దిశ, నేషనల్ బ్యూరో: వ్యోమగాముల శిక్షణ, పలు పరిశోధనలకు సంబంధించిన కార్యకలాపాలపై సహకారం కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) మధ్య కీలక ఒప్పందం కుదిరింది. దీనిపై ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌ (Somanath), ఈఎస్‌ఏ డైరెక్టర్‌ డాక్టర్ జోసెఫ్‌ అష్చ్ బాచెర్(Dr Josef Aschbacher)లు సంతకాలు చేశారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం.. మానవ అన్వేషణ, వివిధ పరిశోధనలలో రెండు ఏజెన్సీలు సహకరించుకుంటాయని ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది. ప్రత్యేకించి అస్ట్రోనాట్స్ శిక్షణ, ప్రయోగాలు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఈఎస్ఏ సౌకర్యాల వినియోగం, హ్యూమన్, బయోమెడికల్ పరిశోధన ప్రయోగాల అమలు, విద్య, ప్రజల అవగాహన కార్యకలాపాలపై కలిసి పని చేయనున్నట్టు పేర్కొ్ంది.

త్వరలో చేపట్టబోయే యాక్సియమ్-4 మిషన్‌లో ఇస్రో గగన్ యాత్రి, ఈఎస్ఏ వ్యోమగామి సిబ్బంది సభ్యులుగా ఉన్నట్టు వెల్లడించింది. ఐఎస్ఎస్ లో ప్రయోగాలను అభివృద్ధి చేయడానికి ఇరు ఏజెన్సీలు సహకరిస్తున్నాయని తెలిపింది. మానవ అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను ఇస్రో సిద్ధం చేసిందని స్పష్టం చేసింది. జోసెఫ్‌ అష్ బాచెర్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందం ఇరు దేశాలకు ఎంతో ముఖ్యమైందని అభివర్ణించారు. దీనిలో ఇరువిరి మధ్య సహకారం మరింత బలోపేతం అవుతుందన్నారు. యాక్సియమ్-4 మిషన్ కోసం ఉమ్మడి పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్‌లోనూ మానవ అంతరిక్ష యాత్రల రంగంలో సహకారాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed