Husband Revenge : మాజీ భార్యపై చిల్లర నాణాలతో భర్త రివెంజ్ యత్నం!

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-21 09:49:34.0  )
Husband Revenge : మాజీ భార్యపై చిల్లర నాణాలతో భర్త రివెంజ్ యత్నం!
X

దిశ, వెబ్ డెస్క్ : విడాకులు (Divorce)తీసుకున్న తన మాజీ భార్య(Wife)పై ఓ భర్త (Husband)తన ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు చేసిన ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళనాడులోని కోయంబత్తూర్‌(Coimbatore)కు చెందిన ఓ జంట విడాకుల కేసును కోయంబత్తూర్‌ ఫ్యామిలీ కోర్టులో ఏడాది కాలంగా సాగుతోంది. ఈ కేసులో మధ్యంతర భరణం(Maintenance) కింద భార్యకు రూ.2 లక్షలు చెల్లించాలని జడ్జి భర్తను ఆదేశించారు. మొదటి వాయిదాగా రూ.80000 చెల్లించాలని భర్త కోర్టుకు వచ్చాడు. ఈ డబ్బులను చెల్లించేందుకు అతడు 20 సంచుల నాణేలు(Coins)ను కోర్టుకు తీసుకొచ్చాడు. నాణేలను లెక్కించుకోలేక మాజీ భార్య అవస్థలు పడితే ఆనందించాలన్నది భర్త ఉద్దేశం.

అయితే సంచుల నిండా రూపాయి, రెండు రూపాయల నాణేల సంచులను చూసిన కోర్టు సిబ్బంది ఉలిక్కిపడ్డారు. అదే సమయంలో భర్త ఇచ్చే మెయింటెనెన్స్ కోసం ఎదురుచూస్తున్న అతని భార్య కూడా షాక్ కు గురైంది. ఇది చూసిన న్యాయమూర్తి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ చిల్లరను తీసుకుని వెళ్లి.. డబ్బులను నోట్ల రూపంలో తీసుకుని రమ్మని ఆదేశించారు. దీంతో ఆ భర్త చేసేది ఏమీ లేక తాను తెచ్చిన నాణేల సంచులను తీసుకుని మళ్లీ కారులో తిరిగి తీసుకెళ్ళాడు. రూ.500 నోట్లగా మార్చి రూ.80 వేలు నగదును విడాకులు తీసుకున్న భార్యకు భరణంగా ఇచ్చాడని సమాచారం.

భార్యపై కోపంతో భరణం మొత్తాన్ని నాణేల రూపంలో సేకరించేందుకు ఆ భర్త పడిన కష్టమంతా జడ్జి ఆదేశాలతో వృధా అయ్యింది. మాజీ భార్యపై ప్రతీకారం తీసుకోవాలనుకున్న తన ప్రయత్నం కాస్త జడ్జి ఆదేశాలతో బెడిసికొట్టినప్పటికి ఆ భర్త చేసిన చర్య మాత్రం వైరల్ గా మారింది. గత ఏడాది జూన్‌లోనూ రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి ఇలానే భార్యకు రూ.55 వేల భరణాన్ని నాణేల రూపంలో ఇచ్చాడు. వీటిని అతడే లెక్కించాలనే షరతుతో కోర్టు నాణేలను అంగీకరించింది.

Advertisement

Next Story