Pushpa 2 : తగ్గాల్సిందే పుష్పా..!

by Javid Pasha |   ( Updated:2024-12-21 12:57:31.0  )
Pushpa 2 : తగ్గాల్సిందే పుష్పా..!
X

దిశ, ఫీచర్స్

అది డిసెంబర్ 4.. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్.. అక్కడంతా పుష్ప 2 ప్రీమియర్ షో హడావిడి.. జనాలంతా గుమిగూడారు. వాళ్లంతా వచ్చింది తమ అభిమాన హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను చూడటానికి. వందలమంది పోగయ్యారు. వాళ్లను కంట్రోల్ చెయ్యడం పోలీసుల తరం కాలేదు. అంతలోనే హీరో ఎంట్రీ. జనాలు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఒకరికొకరు తోసుకున్నారు. అభిమాన హీరోను చూడాలనే ఉత్సాహం.. షేక్ హ్యాండ్ తీసుకోవాలనే ఆరాటంతో పాపం ఎక్కడెక్కడి నుంచో వచ్చారు.

అల్లు అర్జున్ చెయ్యూపుతూ థియేటర్ లోపలికి వెళ్తుంటే.. ఆయనకు భద్రతగా బౌన్సర్లు నిలబడ్డారు. అభిమాన హీరోతో ఫొటో అయినా దిగాలనుకొని వచ్చిన వారి ఆశలు సన్నగిల్లుతున్నాయి. హీరోను చూడకుండానే వెనుదిరుగుతామా అనే ఆందోళన పెరిగింది. తోపులాట ఎక్కువయ్యింది. కట్టలు తెగిన ఆ అభిమానం లాఠీచార్జికి దారితీసింది.

హీరో లోపలికి వెళ్లాడు. అభిమానులు లాఠీ దెబ్బలు తిన్నారు. నిమిషాల్లో అంతా చెల్లాచెదురయ్యారు. కిందపడ్డవారిని తొక్కుతూ వెళ్తున్నారు. ఆ తొక్కిసలాటలో రేవతి.. ఆమె ఇద్దరు పిల్లలూ ఉన్నారు.

దిల్ సుఖ్ నగర్లో ఉండే రేవతికి.. తన పిల్లలకు అల్లు అర్జున్ అంటే ఎంతో అభిమానం. ఆయనను చూడాలీ.. ఫస్ట్ రోజే సినిమా చూసెయ్యాలి అనేంత అభిమానం అన్నమాట.

కట్ చేస్తే రేవతి ఆ తొక్కిసలాటలో గాయపడి చనిపోయింది. తన కొడుకు శ్రీతేజ్ పరిస్థితీ విషమంగా ఉంది.

అభిమానం హద్దు మీరితే..?

ప్రీమియర్ షోకు ఒక్క రేవతి ఫ్యామిలీ మాత్రమే వెళ్లలేదు. అల్లు అర్జున్ మీద అభిమానం, పుష్ప2 సినిమా మీద ఆసక్తి ఉన్న వందలాది మంది వెళ్లారు. వీళ్లంతా ఒకరు ప్రేరేపిస్తేనో.. ఉసిగొలిపితేనో వెళ్లినవాళ్లు కాదు. వాళ్లంతట వాళ్లే అభిమానంతో వెళ్లారు. అభిమానం అనేది వారి వ్యక్తిగతం. ప్రీమియర్ షో చూడటం లేదా ఫస్ట్ రోజు ఫస్ట్ షోనే చూడటం అనేది వారి ఇంట్రెస్ట్.

ఖర్చు పెట్టేది వాళ్ల డబ్బులే.. వాళ్ల ఆనందం కోసమే కాబట్టీ దాన్ని ఎవరూ తప్పుబట్టరు. ఇంకా అందులో ఎవరి ప్రమేయమూ ఉండదు. ఎవరి అనుమతీ అవసరం లేదు. కానీ హద్దులు మీరిన అభిమానం తమతో పాటు ఇంకా ఎంతోమందికి నష్టం చేసింది. జీవితాలను ఆగం చేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనను ఒక ఇన్సిడెంట్ గా మాత్రమే కాదు.. దీనిని ప్రేక్షకుడి జీవనశైలి వైపరీత్యంగా కూడా పేర్కొనవచ్చు.

బాధ్యత ఎవరిది.?

రేవతి కుటుంబానికి జరిగిన అన్యాయానికి బాధ్యత ఎవరిది.? ఆ రోజు రేవతితో పాటు సంధ్య థియేటర్ దగ్గరికి వెళ్లినవాళ్లందరిదీ కాదా.? రేవతికి జరిగినట్లు ఇంకా ఎంతమందికి జరగాలి.? ఇంకా ఎన్ని కుటుంబాలు ఆగం కావాలీ.? మీ అభిమాన హీరో అల్లు అర్జునే అయుండొచ్చు. దానికెవరూ అడ్డు చెప్పరు. అతనితో కలిసి ఫొటో దిగాలన్నది మీ ఆరాటమే కావచ్చు. దాన్నెవరూ కాదనలేరు. కానీ మీ అభిమానం.. అత్యుత్సాహం ఇంకొకరి ప్రాణాలు తీయాలా.? వారి కుటుంబాలను చిన్నాభిన్నం చేయాలా.? అసలు ప్రీమియర్ షో చూస్తేనే సినిమా చూసినట్టా.? ఫస్ట్ డే ఫస్ట్ షో వీక్షిస్తేనే అభిమానం ఉన్నట్లా.? ఎవరికివాళ్లు పోటీలుపడి మరీ సినిమాలు చూడాల్సిన అవసరం ఏముందీ.? ఈ రోజు కాకపోతే రేపు చూడలేమా.? రేపు వీలుకాకపోతే ఎల్లుండి చూడలేమా.? ఎందుకు ఈ విపరీత ధోరణి.? సినిమా చూడాలీ.. అభిమాన హీరోను చూసి తరించాలి అనే కొందరి అత్యుత్సాహం కూడా తొక్కిసలాట జరిగి రేవతి ప్రాణాలు పోవడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఆమె కొడుకు పరిస్థితి విషమంగా మారిందని కూడా చెప్పవచ్చు. అభిమానమనే ముసుగులో కొందరి క్రమశిక్షణలేని, బాధ్యతారాహిత్య ధోరణి ఇలాంటి ఘటనలకు కారణం అవుతుంది.

నష్టం ఎవరికి.?

హీరో బాగానే ఉన్నాడు. థియేటర్ యాజమాన్యం బాగానే ఉంది. భద్రతా ఏర్పాట్లు చూడాల్సిన పోలీసులూ బాగానే ఉన్నారు. ఇక్కడ నష్టపోయిందల్లా రేవతి కుటుంబం. అంటే సామాన్యుడు. ఈ ఇన్సిడెంట్లో హీరో తప్పిదం, థియేటర్ యాజమాన్య తప్పిదం, పోలీసుల తప్పిదం ఏంలేదా అంటే.. వందకు వందశాతం ఉంది. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటనల్లాంటి వాటికి ముమ్మాటికీ వారిదే తప్పు.. వారిదే బాధ్యత. వీళ్ల బాధ్యతారాహిత్యం వల్ల, పుష్ప2 సినిమా వల్ల ఒక అమ్మ ప్రాణాలు కోల్పోయింది.. ఒక పసివాడు చావు బతుకుల మధ్య ఉన్నాడు.

ఒక్కరోజు జైలుకెళ్లి వచ్చిన హీరోను పరామర్శించడానికి ప్రముఖులు తండోప తండాలుగా కదులుతున్నారు. కానీ హాస్పిటల్లో చావు బతుకులు మధ్య ఉన్న శ్రీతేజ్ దగ్గరికి ఏ ప్రముఖుడైనా వెళ్తున్నాడా.?

మారాల్సింది హీరోనా.? ప్రేక్షకుడా.?

పైసలు పెట్టేది ప్రేక్షకుడు.. ప్రయాస పడేది ప్రేక్షకుడు.. ప్రాణాలు పోగొట్టుకునేది ప్రేక్షకుడే. అంత రిస్క్ ఉన్న ప్రేక్షకుడి ధోరణి మారితే ఆటోమేటిగ్గా హీరో మారవచ్చు. థియేటర్ యాజమాన్యం తీరూ మారుతుండొచ్చు. పోలీసు వ్యవస్థ కూడా మారే అవకాశం ఉంది కావచ్చు. హీరో తన అభిమానులను ఉద్దేశించి, సినిమా ప్రమోషన్ కోసం ఎమోషనల్ గా ఇదే నా ఆర్మీ అని సంబోధించగానే భుజాలు ఎగరేయాలా.? అది ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అని గుర్తించలేరా.? వీళ్లే నా సోల్జర్స్ అని గాల్లో ముద్దుపెట్టగానే గల్లా ఎగరేయాలా.? గాల్లోకి ఎగిరేసి గత్తర లేపుతుండు అనే ఆలోచన రాదా.? ఇంట్లో మనల్ని నమ్ముకొని మన ఆర్మీ ఒకటి ఉంటుందనీ.. సోల్జర్స్ లా పనిచేసే మనవాళ్లు ఉన్నారనే సోయి ఉంటే ఏ సినిమా ప్రీమియర్ షో వల్ల తొక్కిసలాట జరగదు. అమాయక ప్రజల ప్రాణాలు పోవు. అవన్నీ కావు.. మా హీరో అంటే మాకు చచ్చేంత ప్రాణం అస్సలు తగ్గేదే లే అంటే నష్టపోయేది ప్రేక్షకుడే. హీరోలు.. థియేటర్ యాజమాన్యాలు మాత్రం రెట్టించిన ఉత్సాహంతో ఇలాంటి తొక్కిసలాటలను తొక్కుకుంటూ పుష్ప3,4,5 ఇలా తీసుకుంటూ పోతూనే ఉంటారు.

తగ్గుతారా లేదా.?

ఇప్పటి సినిమాల్లో హీరోలు స్మగర్లు, రౌడీలు, పోకిరీలు. వాళ్లు పర్ఫెక్ట్ గానే ఉన్నారు. డైరెక్ట్ టైటిల్సే పెట్టి ప్రేక్షకుడి అటెన్షన్ ను డైవర్ట్ చేస్తు్న్నారు. జులాయి, ఆవారా, రౌడీ సినిమాలను ఎగబడి చూడాలి. కానీ మన పిల్లలు మాత్రం మిస్టర్ పర్ఫెక్ట్ అవ్వాలి అనుకుంటారు చాలామంది. పిల్లలు మిస్టర్ పర్ఫెక్ట్ అవ్వాలంటే ముందు మన ఆసక్తి మారాలి. పుష్ప సినిమానే చూసుకుందాం. హీరో ఈ సినిమాలో ఎప్పుడు చూసినా తంబాకు వేసుకునే కనిపిస్తాడు. ఆఖరికి హీరోయిన్ చికెన్ వండి టేస్ట్ ఎలా ఉందో చెప్పు సామీ అని అడిగినప్పుడు కూడా నోట్లో తంబాకు ఉమ్మేయకుండానే టేస్ట్ చూసి బాలేదని చెప్తాడు. ఈ సీన్ కు థియేటర్లో ఈలలు, కేకలు. ఈ సీన్ పిల్లలపై ప్రభావం చూపించదా.? అయినా నోట్లో తంబాకుతో ఉన్నోడికి రుచి ఎలా తెలుస్తుంది.? ఇంకో సీన్లో పోలీసాఫీసర్ స్విమ్మింగ్ పూల్లో ఉంటే పుష్పరాజ్ దాంట్లో టాయిలెట్ పోస్తాడు. ఇదికూడా అభిమానికి ఈలలేసే సన్నివేశమే. ఇలాంటి సీన్లకోసమేనా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎగబడేది.?

మరీ ముఖ్యంగా పుష్పరాజ్ ఒక ఎర్ర చందనం స్మగ్లర్. ఆఫీసర్లను బురిడీ కొట్టించి స్మగ్లింగ్ చేస్తుంటే టాకీస్లో ఒక్కటే చప్పట్లు. స్మగ్లర్లపైనే మీ అభిమానమైతే మరి మీ పిల్లల అభిమానం ఎవరి మీదుండాలో కూడా ఆలోచించుకోండీ. ఇవన్నీ కావు.. సినిమాను సినిమా కోణంలో చూడాలీ అని అంటారా.? ఇది బాగుంది. ఐతే.. హీరోను కూడా హీరో కోణంలోనే చూడండీ. ఈ ఎగబడటాలు.. ఎగిరిదుంకడాలు.. తొక్కిసలాటలు.. లాఠీ చార్జీలు ఎందుకు చెప్పండీ.? తగ్గేదే.. అస్సలు తగ్గేదే లే అని అన్నీ కోల్పోయి అసలైన పుష్పం మీరే కావడం ఎందుకు.?

Also Read..

Pushpa 2 stampede: మాకు హీరోలు, పరిశ్రమ మీద కోపం లేదు.. మంత్రి శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు


Advertisement

Next Story