- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జమిలి ఎన్నికలు సాధ్యమేనా..?
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నియంతృత్వ పోకడలు మరోసారి జమిలి రూపంలో బయటపడ్డాయి. అధికారంలో ఉన్నాం కదా ఏం చేసినా చెల్లుతుందనే ఒంటెత్తు పోకడలతో పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని, దాని రూపకర్త డా.బీఆర్. అంబేద్కర్‌ని కించపరుస్తున్న బీజేపీ మరో ప్రమాదకరమైన అడుగులు వేస్తోంది. రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ‘ఒకే దేశం`ఒకే ఎన్నిక’ అంటూ జమిలి ఎన్నికల ముసాయిదా బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందినా 2/3 మెజార్టీ రాకపోవడంతో జమిలి ఎన్నికలు సాధ్యమేనా..? అనే సందేహాలొస్తున్నాయి.
ఇల్లు అలుకగానే పండుగ కాదు. జమిలి ఎన్నికల బిల్లుపై కేంద్రంలో బీజేపీకి ముందుంది ముసళ్ల పండుగ అని ఖాయంగా చెప్పవచ్చు. లోక్‌సభకు, రాష్ట్ర శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యంతో తీసుకొస్తున్న ఈ జమిలి ఎన్నికల బిల్లుపై బీజేపీ చెబుతున్న కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. గతంలో దేశంలో ఎన్నికలు జమిలి పద్దతిలోనే ఉండేవని, ఇప్పుడు ఎక్కడో చోట నిత్యం ఎన్నికలతో అభివృద్ధి కుంటుపడుతోందని బీజేపీ వాదిస్తోంది. గతంలో 1951`52, 1957, 1962, 1967లో జమిలి ఎన్నికలు నిర్వహించగా ఎదురైన సమస్యలను పరిగణలోకి తీసుకునే తర్వాతి కాలంలో విడివిడిగానే ఎన్నికలు జరపడానికి మొగ్గు చూపారు. అభివృద్ధి అంశాన్ని తీసుకుంటే రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల కోడ్ సంబంధిత రాష్ట్రానికే పరిమితమవడంతో అక్కడే కొంతకాలం బ్రేక్ పడుతుంది. అంతేకాని ఇతర రాష్ట్రాలపై ఈ ప్రభావం ఉండదు. మరోవైపు భిన్నత్వంలో ఏకత్వంగా ఉండే మన దేశంలో భిన్న సంస్కృతి, వైరుధ్యమైన వాతావరణ పరిస్థితులుండడంతో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో సమయం అనువుగా ఉంటుంది.
భద్రతా దళాల తరలింపు అసాధ్యం
ఇందుకు 2024 లోక్‌సభ ఎన్నికల అనంతరం జరిగిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలనే ఉదాహరణగా తీసుకోవచ్చు. హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికలతో కాకుండా మహారాష్ట్ర ఎన్నికలను స్థానికంగా దీపావళి పండుగను ఘనంగా చేసుకుంటారనే కారణంతో ఒక నెల ఆలస్యంగా నిర్వహించారు. దీనికి తోడు మహారాష్ట్ర శాసనసభకు కాలపరిమితి ఉంది కాబట్టి ఆలస్యంగా ఎన్నికలు పెట్టారనే వాదనే నిజం అయితే, జార్ఖండ్ ఎన్నికలను రెండు నెలలు ముందుగా మహారాష్ట్రతో ఎందుకు నిర్వహించారు? మరోవైపు ఎన్నికల కోసం భద్రతా దళాల తరలింపు కూడా ప్రహసనంగా మారడం ఖాయం. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సున్నిత ప్రాంతాలకు బలగాల తరలింపు కోసం ఎన్నికలను విడతలవారిగా నిర్వహిస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలంటే శాంతిభద్రతల నిర్వహణ కత్తిమీద సామే.
రాజకీయ గందరగోళం ఖాయం
జమిలి ఎన్నికలపై బీజేపీ కుట్రలను పసిగట్టిన కాంగ్రెస్ ప్రతిపక్షాలను కూడదీసుకొని ఈ ప్రక్రియను వ్యతిరేకించడంతో రామనాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని వేయగా 32 పార్టీలు సానుకూలంగా ఉండగా, 15 పార్టీలు వ్యతిరేకించాయి. గతంలో జమిలి ఎన్నికలను నిర్వహించిన కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తుందనే వితండ వాదాన్ని బీజేపీ ముందుకు తెస్తుంది. స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో పరిస్థితులు వేరు, తర్వాత పలు నూతన రాష్ట్రాలు ముఖ్యంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడంతో రాజకీయ పరిస్థితులు మారాయి. వివిధ కారణాలతో కొన్ని ప్రభుత్వాలు కూలిపోవడం, మరికొన్ని చోట్ల రాష్ట్రపతి పాలన విధింపుతో ఎన్నికల కాలపరిమితి, గడువులు మారాయి. దీంతో 1970 తర్వాత లోక్‌సభ ఎన్నికలతో సంబంధం లేకుండా రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒకేసారి ఎన్నికలంటే దేశంలో రాజకీయ గందరగోళం నెలకొనడం ఖాయం. గతంలో కాంగ్రెస్ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటే, ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం తిరోగమన దిశలో పయనిస్తోంది.
తప్పుచేస్తే శిక్షించే అధికారం ఉండదు
ప్రజాస్వామ్య దేశంలో జమిలి ఎన్నికల కోసం ఏకఛత్రాధిపత్యం పోకడలతో బీజేపీ కుట్రలను పన్నుతోంది. కేంద్రంలో ప్రభుత్వం నచ్చకపోతే, ఆ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో వ్యతిరేకించడం, రాష్ట్రంలో ప్రభుత్వం నచ్చకపోతే లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీని వ్యతిరేకించడం ఇప్పుడు చెల్లుబాటు అవుతుంది. అదే జమిలి ఎన్నికలైతే ఒకసారి ఎన్నికైన ప్రభుత్వం నియంతృత్వ పోకడలకు పోతే ప్రజలు ఐదేళ్లు బాధపడాల్సి ఉంటుంది. అసెంబ్లీకి పార్లమెంటుకి వేర్వేరు ఎన్నికలు జరిగితే తప్పు చేసిన పార్టీలను శిక్షించే అవకాశం ప్రజలకు దక్కుతుంది. పాలకులకు కూడా కొంత భయం ఉంటుంది. అదే ఒకేసారి ఎన్నికలైతే ఒకసారి గెలిచిన బీజేపీ వంటి పార్టీల నియంతృత్వ ధోరణికి కళ్లెం వేయడం కష్టం.
జమిలి బిల్లుకు ఆమోదం కష్టం!
రాజ్యాంగ విరుద్ధంగా తీసుకొస్తున్న జమిలి ఎన్నికలు బిల్లు ఆమోదం అంత తేలిక కాదని తెలిసినా బీజేపీ ప్రభుత్వం మూర్ఖంగా ముందుకెళ్తుంది. రాజ్యాంగం స్ఫూర్తికి విరుద్దంగా జమిలి ఎన్నికల కోసం 129 రాజ్యాంగ సవరణ, కేంద్ర పాలిత ప్రాంతల చట్ట సవరణ బిల్లులను రూపొందించి లోక్ సభలో ప్రవేశపెట్టిన బీజేపీకి తొలి అడుగులోనే తల బొప్పి కట్టింది. బిల్లుపై ఓటింగ్‌కి కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి పట్టుబట్టడంతో 467 మంది ఓటింగ్లో పాల్గొనగా 269 ఓట్లు అనుకూలంగా, 198 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. సాంకేతికంగా బిల్లు ఆమోదం పొందినా ప్రభుత్వానికి మూడింట రెండు వంతుల మోజార్టీ (307 ఓట్లు) ఆధిక్యత లభించకపోవడం శుభపరిణామం. అంతేకాక, బీజేపీకి చెందిన 20 మంది ఎంపీలు ఓటింగుకు గైర్హాజరవడం కూడా బిల్లుపై వారి పార్టీలోనే సంపూర్ణ మద్దతు లేదని తేటతెల్లమైంది. ప్రస్తుత లోక్‌సభలో ఎన్డీయే కూటమి బలం 293. ప్రతిపక్ష ‘ఇండియా’ బలం 234. బిల్లు ఆమోదానికి 2/3 మెజార్టీ అంటే 361 ఓట్లు రావాలి. రాజ్యసభలో 164 అవసరం కాగా ఎన్డీఏ బలం 122 మాత్రమే. ఇక్కడ మరో 42 మంది మద్దతు కావాలి. ఈ లెక్కలను పరిశీలిస్తే ఉభయ సభల్లోనూ బిల్లుకు ఎదురుదెబ్బ తప్పదు. అయినా బీజేపీ మొండిగా ముందుకు పోతుందంటే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కుట్రలకు తెరలేపుతుందని భావించవచ్చు.
ఎప్పుడు పెడతారో కూడా స్పష్టత లేదు
ఒకేసారి ఎన్నికలను నిర్వహించాలని చూస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ అంశంపై స్పష్టత లేదు. జమిలి ఎన్నికల బిల్లు పార్లమెంట్‌లో పాసుకావడమే అసాధ్యమైన పరిస్థితుల్లో.. జమిలి ఎన్నికలు 2027లో అని ఒకసారి, కాదు 2029 అని మరోసారి, ఈ రెండు కాదు 2034లో అని ఇంకోసారి లీకులిస్తూ ప్రజలను గందరగోళపరుస్తుంది. త్వరలో దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. దీని అనుగుణంగా మహిళా రిజర్వేషన్లు కేటాయించాల్సింది ఉంది. వీటికి తోడు కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నట్లు జనాభా లెక్కల్లో కులగణన కూడా చేపడితే బడుగు బలహీన వర్గాలకూ న్యాయం జరగుతుంది. ఈ ప్రక్రియలన్నీ పూర్తి చేయకుండా, బలం లేకపోయినా జమిలి ఎన్నికలంటూ ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న హడావుడి చేస్తుంది.
నియంతృత్వానికి పరాకాష్ట
రాజ్యాంగాన్ని, డా.బీఆర్. అంబేద్కర్‌ని నిత్యం తూలనాడే బీజేపీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుందని భావించడం అత్యాశే అవుతుంది. ప్రజాసామ్యవాదులు భయపడుతున్నట్టే నియంతృత్వ పోకడలతో జమిలి బిల్లును ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ నేతృత్వంలో ‘ఇండియా’ కూటమి తీవ్రంగా వ్యతిరేకించడంతో వెనకడుగు వేసిన బీజేపీ బిల్లును ‘జేపీసీ’ పరిశీలనకు పంపింది. ఉభయ సభల్లో బలం లేకపోయినా చట్టవిరుద్ధంగా బిల్లును ఆమోదించుకోవాలని చూస్తున్న నరేంద్రమోడీ కుట్రలను ఛేదించంలో భాగంగా మేధావులు, ప్రజాస్వామ్యవాదులు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న కాంగ్రెస్‌కు బాసటగా నిలిస్తే దేశంలో నియంత పాలన అంతమై, ప్రజాస్వామ్యం మళ్లీ చిగురిస్తుంది.
-బి.మహేశ్ కుమార్ గౌడ్
ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు