మే 17 తర్వాత ఏంటి? : లాక్‌డౌన్‌పై కాంగ్రెస్

by vinod kumar |
మే 17 తర్వాత ఏంటి? : లాక్‌డౌన్‌పై కాంగ్రెస్
X

న్యూఢిల్లీ: ప్రస్తుతం పొడిగించిన లాక్‌డౌన్ గడువు ముగిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వ వ్యూహమేంటని కాంగ్రెస్ ప్రశ్నించింది. ఏ ప్రాతిపదికన లాక్‌డౌన్ పొడిగింపులను నిర్ణయిస్తున్నాదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అడిగారు. ఈ లాక్‌డౌన్ నుంచి బయటపడే, ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టే ప్రణాళికలు ఏవైనా ఉన్నాయా? అని కాంగ్రెస్ అధికారంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రశ్నించారు. అంతేకాదు, ఆర్థికాన్ని పరుగులు పెట్టించే వ్యూహాలున్నాయా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ టాప్ లీడర్లు.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మన్మోహన్ సింగ్, వీరప్ప మొయిలీ, రాహుల్ గాంధీలు కాంగ్రెస్ సీఎంలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో లాక్‌డౌన్, ఆర్థికాంశాలు చర్చకు వచ్చాయి.

ఈ సమావేశంలో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం రెండు కమిటీలను ఏర్పాటు చేసిందని వివరించారు. లాక్‌డౌన్ నుంచి బయటపడే అవకాశాలపై ఒక కమిటీ, ఆర్థికరంగం పునరుత్తేజితం కావడానికి రెండో కమిటీ సలహాలనిస్తుందని తెలిపారు. ఈ ఆపత్కాలంలో కేంద్రం తమకు ఆర్థిక సహకారాన్ని ప్రకటించాలని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. ఆర్థిక తోడ్పాటు లేనిది ఈ కష్టకాలంలో రాష్ట్రాలను ఎలా నడిపేదని వివరించారు. ఇప్పటికి తాము రూ. 10,000 కోట్ల రాబడి కోల్పోయామని చెప్పారు. కానీ, ఆర్థిక ప్యాకేజీ గురించి పీఎం మోడీ నోట ఒక్కమాట కూడా రావడం లేదని విమర్శించారు. కరోనాతో రాష్ట్రాలు తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నాయని ఛత్తీస్‌గడ్ సీఎం భుపేశ్ భగేల్ అన్నారు. రాష్ట్రాలన్నింటికీ ఆర్థిక సహకారాన్ని అందించాల్సిందేనని డిమాండ్ చేశారు.

జోన్‌లపై రాష్ట్రాలను సంప్రదించలేదు

జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్‌లుగా విభజించే విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను సంప్రదించలేదని కాంగ్రెస్ సీఎంలు ఆరోపించారు. ఢిల్లీలో కూర్చొని రాష్ట్రాల్లోని జిల్లాల పరిస్థితులను ఎలా అంచనా వేస్తారని ప్రశ్నించారు. క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకోకుండానే జోన్‌లుగా విభజించడంపైనే ఆందోళన చెందుతున్నామని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ అన్నారు. రాష్ట్రాలను సంప్రదించకుండానే కేంద్ర ప్రభుత్వం.. జోన్‌లను విభజించిందని పుదుచ్చేరి సీఎం వి నారాయణస్వామి చెప్పారు. ఒక్క రాష్ట్ర సీఎంను కూడా సంప్రదించలేదు. ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు.

కేంద్రం ఆర్థిక సాయం చేయట్లేదు : చిదంబరం

ఆర్థికంగా దెబ్బతిని రాష్ట్రాలు సతమతమవుతున్నాయి. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆర్థిక సాయమందించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు. ప్రభుత్వం నుంచి ప్రజలకు డబ్బు పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాం కానీ, కేంద్రం అందుకు విరుద్ధంగా పనిచేస్తున్నదని ఆయన విమర్శించారు. ఇది దారుణమని అన్నారు.

tags: coronavirus, lockdown, congress, cm, sonia gandhi, zone

Advertisement

Next Story