‘ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో అణిచి వేస్తాం’

by Shyam |
‘ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో అణిచి వేస్తాం’
X

దిశ, అంబర్‌పేట్: దేశంలో ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో అణిచి వేశామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అత్యాధునిక టెక్నాలజీతో నూతనంగా నిర్మించిన కాచిగూడ పోలీస్ స్టేషన్ భవనాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో ఎక్కడా కూడా బాంబు పేలుళ్లు, ఉగ్రవాద కార్యకలాపాలు, కర్ఫ్యూ లేకుండా సమర్థవంతమైన పాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత ఈశాన్య భారత దేశంలో అభివృద్ధి జరిగిందని తెలిపారు.

జమ్మూకాశ్మీర్ తో సహా దేశ వ్యాప్తంగా అల్లర్లు తగ్గిపోయాయని వివరించారు. అన్ని రాష్ట్రాల్లో ఉండే పర్యాటక ప్రదేశాల్లో టూరిస్ట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి మ‌హ‌మూద్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీస్ వ్యవస్థ బలోపేతానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారని తెలిపారు. మహిళల కోసం ప్రత్యేక రక్షణ కల్పిస్తున్నట్లు చెప్పారు. డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. కాచిగూడ పోలీస్ స్టేష‌న్ నూత‌న భ‌వ‌నం కోసం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా గ‌త ప్రభుత్వాలు ప‌ట్టించుకోలేద‌ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీస్ స్టేషన్లు అత్యాధునిక టెక్నాలజీతో రూపుదిద్దుకుంటున్నాయని వివరించారు.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో 6.5 ల‌క్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామ‌న్నారు. శాంతి భ‌ద్రత‌ల ప‌రిర‌క్షణ‌కు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నార‌ని, సైబ‌ర్ నేరాల‌పై ఉక్కుపాదం మోపుతున్నామ‌ని వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, ఎమ్మెల్యే కాలేరు వెంక‌టేశ్‌, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, నగర కమిషనర్ అంజనీ కుమార్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed