- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
2024లో కుప్పంలో వైసీపీ జెండా ఎగురవేస్తాం: ఎమ్మెల్సీ అభ్యర్థి భరత్
దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు గట్టి షాక్ తగిలింది. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎన్నడూ ఊహించని విధంగా కుప్పం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఈ ఎన్నికల్లో టీడీపీ అంచనాలు తలకిందులయ్యాయి. టీడీపీ కంచుకోట అయిన కుప్పంను వైసీపీ బద్దలు కొట్టింది. కుప్పం మున్సిపాలిటీని వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. కుప్పంలో ఎలాగైనా గెలిచి తీరుతామని.. ఈసారి చంద్రబాబు కంచుకోట బద్దలు కొడతామని చెప్పిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నంతపనీ చేసేశారు.
చంద్రబాబు అడ్డాపై వైసీపీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తున్నారు. ఇటీవల కుప్పం పర్యటనలో చంద్రబాబు మంత్రి పెద్దిరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమైనా పుడింగా అంటూ ఘాటు విమర్శలు చేశారు. పులివెందుల, పుంగనూరు నియోజకవర్గంలో ఓటేసే పరిస్థితి లేదని.. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే విధంగా ప్రవర్తిస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో ఉండేవారా అంటూ నిలదీశారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భరత్. మంత్రి పెద్దిరెడ్డి పుడింగేనంటూ చంద్రబాబుకు కౌంటర్ ఇస్తున్నారు.
చక్రం తిప్పిన పెద్దిరెడ్డి..
కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ విజయకేతనం ఎగురవేసింది. నలభై ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు అడ్డాలో వైసీపీ జెండా రెపరెపలాడింది. చంద్రబాబును ఆరుసార్లు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపిన కుప్పం ప్రజలు ఈసారి చంద్రబాబుకు ఊహించని షాక్ ఇచ్చారు. కుప్పం మున్సిపాలిటీలో గెలుపుపై రాష్ట్ర ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూశారు. నరాలు తెగే ఉత్కంఠ నడుమ కుప్పంను వైసీపీ తమ ఖాతాలో వేసుకుంది. ఇకపోతే కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకు చంద్రబాబు, నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలే కారణమని పెద్దిరెడ్డే స్వయంగా వెల్లడించారు.
ఈ నేపథ్యంలో కుప్పం మున్సిపల్ ఎన్నిక చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి అన్న రీతిలో జరిగింది. చంద్రబాబును కుప్పంకు రానివ్వమని పదేపదే చెప్పిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంతే వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పెద్దిరెడ్డి రాజకీయ జీవితంలో ఎన్నడూ కష్టపడని విధంగా కుప్పం మున్సిపల్ ఎన్నికలకు కష్టపడ్డారు. అంతేకాదు జిల్లా మంత్రులు నేతలు మినహా ఇతర ప్రాంతాలకు చెందిన మంత్రులను గానీ.. ఎమ్మెల్యేలను గానీ అడుగుపెట్టనీయకుండా అన్నీ తానై నిలిచారు. ఒకవైపు కొడుకు ఎంపీ మిథున్ రెడ్డి, మరోవైపు సోదరుడు ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డిలు గడపగడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. అంతేకాదు పోల్ మేనేజ్మెంట్ చేయడంలోనూ పెద్దిరెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
కలిసొచ్చిన పోల్‌మేనేజ్మెంట్..
కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని కోలుకోలేని దెబ్బతీసిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కుప్పం నియోజకవర్గం పరిధిలో టీడీపీ బలహీన పడేలా చేయడంలో మంత్రి పెద్దిరెడ్డి పాచిక పారింది. ఆయన వేసిన రాజకీయ వ్యూహాలు ఫలించాయి. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలు, బద్వేలు ఉపఎన్నికలను స్వయంగా పర్యవేక్షించిన మంత్రి పెద్దిరెడ్డి అదే వ్యూహాన్ని కుప్పంపై అప్లై చేసి విజయం సాధించారు. బద్వేలు ఉప ఎన్నికలో ఊహించని విధంగా వైసీపీకి 90 వేలకుపైగా మెజారిటీ రావడంలో ఎలా వ్యూహాత్మకంగా వ్యవహరించారో అదే పోల్‌మేనేజ్మెంట్ కుప్పంలోనూ చేశారు.
అంతే 25 వార్డులకు గానూ వైసీపీ 19 వార్డుల్లో విజయకేతనం ఎగురవేసింది. టీడీపీ కేవలం 6స్థానాలకే పరిమితమయ్యింది. కుప్పం పర్యటనలో కూడా మంత్రి పెద్దిరెడ్డి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఓటర్లను ఆకర్షించేలా వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ఆయన ఇంటింటికీ చేరవేశారు. అంతేకాదు చంద్రబాబు వైఫల్యాన్నీ ఎండగట్టారు. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు తన సొంత నియోజకవర్గానికి చేసింది శూన్యమంటూ విమర్శలు గుప్పించారు. అలాగే ఇతర వర్గాలను ఆకట్టుకునేందుకు వలసల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు.
బెంగళూరుకు వలస ఎందుకు..? కుప్పం నుంచి రోజూ వందలాది మంది పక్కనే ఉన్నబెంగళూరుకు వలస వెళ్లే పరిస్థితిని చంద్రబాబు నివారించలేకపోయారని పెద్దిరెడ్డి విమర్శించారు. గుడిపల్లి మండలం బసినిగాని పల్లి వద్ద రెండు టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ను నిర్మించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పించారని చెప్పారు. హంద్రీనీవా జలాలు ఇంకో వారం రోజుల్లోనే కుప్పానికి రానున్నాయంటూ పెద్దిరెడ్డి హామీలకు ఓట్లతో స్వాగతం పలికారు.
2019 నుంచే కుప్పంపై గురి
వాస్తవానికి 2019 ఎన్నికల్లోనే చంద్రబాబును ఓడించాలనే లక్ష్యంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పనిచేస్తున్నారు. చంద్రబాబు ఓటమే లక్ష్యంగా పావులు కదిపారు. అయితే ఆ ఎన్నికల్లో చంద్రబాబు మెజార్టీ 2014తో పోలిస్తే దాదాపు 14 వేలు తగ్గించడంలో విజయం సాధించారు. 2019 ఎన్నికల తర్వాత జరిగిన పంచాయతీ, సర్పంచ్ ఎన్నికలను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 89 పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో 74 చోట్ల వైసీపీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందారు. ఇక పరిషత్ ఎన్నికల్లో అన్ని జెడ్పీటీసీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. అలాగే 63 ఎంపీటీసీ స్థానాలను సైతం వైసీపీ సొంతం చేసుకుంది. తాజాగా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధించడంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు.