రోగులను అక్కున చేర్చుకోనున్న సెంట్రల్ జైలు

by Anukaran |   ( Updated:2021-06-02 11:49:03.0  )
Warangal Central Jail
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో మరో జైలు రూపు రేఖలు మారుబోతోంది. ఇప్పటి వరకు ఖైదీల పరివర్తనా కేంద్రంగా ఉన్న మరో జైలు చికిత్సకేంద్రంగా రూపుదిద్దుకోబోతోంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కేంద్ర కారాగారం కాస్తా రోగులను అక్కున చేర్చుకునే కేంద్రంగా మారనుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో వరంగల్ కేంద్ర కారాగారం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దనున్నారు. తెలంగాణాలో ఉన్న సెంట్రల్ జైళ్లలో ఒకటైన వరంగల్ కేంద్ర కారాగారం దవాఖానాగా రూపాంతరం చెందనుంది.

నాడు అది.. నేడిది..

130 ఏళ్ల క్రితం నిర్మించిన వరంగల్ సెంట్రల్ జైల్ నిజాం కాలం నాడే నిర్మించారు. సువిశాలమైన స్థలంలో ఉన్న ఈ జైలు వరంగల్ నడిబొడ్డున ఉండడంతో దానిని మార్చి ఆసుపత్రి నిర్మించాలని నిర్ణయించారు. దీనివల్ల హైదరాబాద్ తరువాత సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించే నగరంగా వరంగల్ రికార్డుల్లోకి ఎక్కనుంది. దీనిని ఆనుకునే కాకతీయ మెడికల్ కాలేజీ ఉండడం, కూత వేటు దూరంలో ఇప్పుడు వైద్య సేవలందిస్తున్న ఎంజీఎం కూడా ఉండడంతో కేంద్ర కారాగారాన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దితే సౌలభ్యంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

కాళోజీ మెడికల్ యూనివర్శిటీ కూడా వరంగల్ కేంద్రంగానే ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇప్పటికే కాకతీయ మెడికల్ కాలేజ్ కేంద్రంగా యూనివర్శిటీ సేవలందిస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో వరంగల్ కేంద్రంగానే రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య సేవలకు సంబంధించిన విద్యావ్యవస్థ రూపుదిద్దుకోనుంది. వరంగల్ లో ఆధునిక వైద్యశాల కూడా ఎంతో అవసరమని గుర్తించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్న ఖైదీలను ఇతర జైళ్లకు తరలించే ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది.

అయితే ఇప్పటి వరకు రాష్ట్రంలో రెండు జైళ్లను ఆసుపత్రులుగా మార్చారు. గతంలో హైదరాబాద్ ముషీరాబాద్ లో ఉన్న జైలును తొలగించి గాంధీ ఆసుపత్రి నిర్మించారు. ఆ తరువాత ఇప్పుడు వరంగల్ సెంట్రల్ జైలును దవాఖానాగా మార్చబోతున్నారు. దీంతో రెండో జైలు ఆసుపత్రిగా మారిన రికార్డును కూడా వరంగల్ సొంతం చేసుకుంది.

Advertisement

Next Story