యాచకుడి ‘సోషల్ డిస్టెన్స్’.. అనుసరణీయం.. ఆదర్శం

by Sujitha Rachapalli |   ( Updated:2020-04-12 01:29:45.0  )
యాచకుడి ‘సోషల్ డిస్టెన్స్’.. అనుసరణీయం.. ఆదర్శం
X

దిశ వెబ్ డెస్క్: కరోనా విజృంభిస్తున్న వేళ… పౌరులుగా అందరూ విధిగా లాక్ డౌన్ ను పాటించాలి. ప్రభుత్వ ఆదేశాలను, డాక్టర్ల సూచనలను వినాలి. కానీ ఎందరో ఆకతాయిలు, మరెంతోమంది సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదు. మార్కెట్లలో, రేషన్ షాపుల్లో, కిరాణ దుకాణాల్లో.. ఎంతోమంది రూల్స్ ను బ్రేక్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఓ యాచకుడు సోషల్ డిస్టెన్స్ పాటించి అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. ఆదర్శంగా నిలుస్తున్నాడు. తనకు ఆహారం అందించడానికి వచ్చిన పోలీసులను మూడు అడుగుల దూరంలోనే నిలిచిపోవాలని సూచించి ఔరా అనిపించాడు.

కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో.. ఎంతోమంది దినసరి కూలీలకు, భిక్షగాళ్లకు మరెంతోమంది అనాథలకు ఆహారం లేకుండా పోయింది. ఇదే సమయంలో సహృదయులు, వలంటీర్లు తమకు తోచినంత వారికి ఆహారం అందిస్తున్నారు. పోలీసులు కూడా స్వచ్ఛందంగా రోడ్లపై నివసించే వారికి ఆహారం అందిస్తున్నారు. అలాగే కేరళ పోలీసులు .. రోడ్ల పక్కన నివసించే వారికి ఆహరం అందిస్తున్నారు. అలా కోజికోడ్ లోని ఓ వీధిలో యాచకుడు పడుకుని ఉన్నాడు. కరోనా కారణంగానో లేక మరో కారణమో గానీ నోటికి గుడ్డ కట్టుకున్నాడు. ఆహారం అందించడానికి అతని దగ్గరగా పోలీసులు వెళ్లారు. అంతలోనే వాళ్లను గమనించిన యాచకుడు తనకు మూడు అడుగుల దూరంలోనే ఆగిపోవాలని వారించాడు. అంతేకాదు వాళ్ల ముందు ఓ గీత గీసి అక్కడే ఆగిపోమ్మన్నాడు. ఆ గీతకు వెలుపల ఆహార పొట్లం పెట్టాల్సిందిగా వారికి చెప్పాడు. ఆ పోలీసులు ఆ పొట్లాన్ని అక్కడ పెట్టి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఎంతోమంది యాచకుడ్ని అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు.. అతడు ఎంతోమందికి ఆదర్శనీయమని అభిప్రాయపడుతున్నారు. సోషల్ డిస్టెన్స్ తో పాటు, ముఖానికి మాస్క్ పెట్టుకోవడం వల్ల అతడు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నాడంటూ.. ప్రశంసలు కురిపిస్తున్నారు.

Tags: coronavirus, lockdown, kerala, beggar, police, food, help

Advertisement

Next Story