గ్రామాల్లో బాంబుల మోత.. బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్న ప్రజలు

by Sridhar Babu |
గ్రామాల్లో బాంబుల మోత.. బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్న ప్రజలు
X

దిశ, చండూరు : మర్రిగూడ మండలంలోని ఖుదబక్షిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాలు బాంబుల మోతతో గత రెండు రోజుల నుంచి దద్దరిల్లుతున్నాయి. మండలంలో 20 గ్రామ పంచాయతీలు ఉండగా 14 గ్రామ పంచాయతీల పరిధిలోని గ్రామాల ప్రజలు బాంబుల మోతకు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. అక్రమ పర్మిషన్‌తో బాంబుల ఫ్యాక్టరీ యజమాని యధేచ్ఛగా బాంబులు తయారు చేస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నది.

ప్రజల ఆరోపణల నేపథ్యంలో తహసీల్దార్ దేశియా నాయక్ శనివారం ఘటన స్థలానికి చేరుకొని యజమాని కొరకు వాకబు చేశారు. 2015 సంవత్సరంలో ఇన్ఫోటెక్ క్లాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఖుదబక్షిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 275, 276, 277 లో ఉన్న 20 ఎకరాల భూమిని బాంబుల ఫ్యాక్టరీ‌కి గ్రామపంచాయతీ నుంచి అనుమతి పొందారు. నాటి నుంచి నేటి వరకు యదేచ్ఛగా బాంబులు తయారు చేస్తూ శాంపిల్స్ కోసం బాంబులను పేల్చడంతో రోజుకు రెండు మూడు సార్లు 14 గ్రామపంచాయతీల పరిధిలోని గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

గత 3 రోజులుగా బాంబులు మోత మోగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వ్యవసాయ భూముల రైతులు సైతం తమ మోటర్లు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట కాకుండా పగటి పూట బాంబులు పేల్చడంతో ఇంట్లో ఉన్న సామాన్లు కిందపడటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గత ఐదు సంవత్సరాల కాలంలో ఇద్దరు వ్యక్తులు ఈ ఫ్యాక్టరీ పరిధిలో మృతి చెందినట్లుగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. మృతి చెందిన వ్యక్తులు ఎస్టీ (లంబాడా) కేటగిరికి చెందిన వ్యక్తులు కావడంతో పోలీసులు అధికారులు కేసు కాకుండా నీరుగార్చినట్లు సమాచారం. ఉన్నతాధికారులు దృష్టి సారించి ఫ్యాక్టరీలో అక్రమంగా బాంబులను పేలుస్తున్న ఫ్యాక్టరీ యజమానిపై చర్యలు తీసుకొని ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

NGL1

Advertisement

Next Story