మా పిల్లల భవిష్యత్ ఏం కావాలి..? సమయపాలన పాటించని టీచర్లు మాకొద్దు!

by Shyam |
మా పిల్లల భవిష్యత్ ఏం కావాలి..? సమయపాలన పాటించని టీచర్లు మాకొద్దు!
X

దిశ, బయ్యారం : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కాచనపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఉపాధ్యాయులు సరైన సమయానికి రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు భోదన జరుగుతుంది. ఈ పాఠశాలలో 64 మంది విద్యార్ధులు ఉన్నారు. వీరి కోసం నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే, ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్కూల్ నడవాల్సి ఉంది. కానీ ఉదయం 9.45 వరకు టీచర్లు పాఠశాలకు రావడం లేదంటూ విద్యార్ధుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు.

సాయంత్రం 4 గంటలు సమయం కాకముందే ఉపాధ్యాయులు వెళ్లిపోతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. ప్రతీరోజు 59మంది విద్యార్థుల వరకు హాజరు శాతం ఉంటున్నా ఇద్దరు ఉపాధ్యాయులు సరిగా విధులకు హాజరుకావడం లేదు. మరో ఇద్దరు మాత్రమే విద్యార్థులకు బోధిస్తున్నారు. టీచర్లు పాఠశాలకు సక్రమంగా రావడం లేదని, వారి సొంత పనులు పూర్తి చేసుకున్నాకే ఇష్టానుసారంగా, చుట్టపు చూపుగా పాఠశాలకు వస్తున్నారని తెలుస్తోంది. కాచనపల్లి పాఠశాల హెచ్‌ఎం దుర్గయ్య, ఇర్ప సమ్మయ్యలు మాత్రమే విధుల్లో ఉంటున్నారని గ్రామస్తులు తెలిపారు.

సమయ పాలన పాటించని టీచర్లను ప్రజాప్రతినిధులు, సర్పంచ్ మందలించినా వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదని ఉపసర్పంచ్ పాండు చెప్పారు. కరోనా టైంలో పాఠశాలలు మూసివేయడంతో విద్యార్థుల చదువులు అంతంత మాత్రంగానే సాగాయి. ఇద్దరు ఉపాధ్యాయులు సరిగా రావడం లేదని ఎన్నో మార్లు మండల శాఖ విద్యా అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. కాంప్లెక్స్ హెచ్ ఎం దేవేంద్రాచారిని ఈ విషయంపై వివరణ కోరగా గతంలో సమయపాలన పాటించని ఇద్దరు ఉపాధ్యాయులను మందలించామని, అయినా, వారి ప్రవర్తనలో మార్పు రావడం లేదన్నారు. ఇదే విషయంపై ఎంఈఓ పూల్‌చంద్‌కు, ఇతర జిల్లా అధికారులకు తెలియజేస్తామన్నారు.

Advertisement

Next Story