రాజన్న ఆలయంలో విజిలెన్స్ అధికారుల సోదాలు.. ఇంతకీ ఏమైంది..?

by Sridhar Babu |
రాజన్న ఆలయంలో విజిలెన్స్ అధికారుల సోదాలు.. ఇంతకీ ఏమైంది..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. విజిలెన్స్ ఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సోదాల్లో దేవాలయంలోని వివిధ విభాగాల్లోని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. సిరిసిల్ల వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పలు అవకతకవలు జరిగాయని వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ సోదాలు నిర్వహించినట్టు సమాచారం. ఆలయంలోని తలనీలాలకు సంబంధించిన వ్యవహారంతో పాటు పలు విభాగాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు ఆయా విభాగాల్లో సోదాలు నిర్వహించిన విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రికార్డులను స్వాధీనం చేసుకుని కరీంనగర్ రీజనల్ విజిలెన్స్ కార్యాలయానికి తరలించారు. సుమారు 7 గంటల పాటు సోదాలు నిర్వహించిన విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ అమృత్ రెడ్డి కొంతమంది రాజన్న ఆలయ ఉద్యోగుల వాంగ్మూలం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

గతంలో కూడా పలు ఫిర్యాదులు రావడంతో 2013లో విజిలెన్స్ అధికారులు రాజన్న దేవాలయ కార్యాలయంలో దాడులు నిర్వహించారు. తాజాగా మరోసారి విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‎మెంట్ అధికారులు సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోనే అతి పెద్ద శైవ క్షేత్రంగా వెరజిల్లుతున్న వేములవాడ రాజన్న ఆలయ ఉద్యోగుల తీరుపై తరుచూ ఆరోపణలు వస్తుండడం గమనార్హం. గ్రామీణ ప్రాంత భక్తులు ఎక్కువగా దర్శించుకునే ఈ ఆలయంలో కొంతమంది ఉద్యోగులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా లేకపోలేదు. గతంలో లడ్డూ ప్రసాదం విక్రయించగా వచ్చిన రూ. 40 లక్షల రూపాయలు దారి మళ్లీంచారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే సదరు ఉద్యోగి నుంచి డబ్బులు రికవరీ చేసిన అధికారులు అంతా సీక్రెట్‌గా మెయింటేన్ చేశారు. సదరు ఉద్యోగిపై క్రమ శిక్షణ చర్యలు తీసుకున్నారు. తరుచూ ఆరోపణలకు వేదికగా మారుతున్న రాజన్న క్షేత్రంలో ఇలాంటి ఘటనలకు తావివ్వకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Next Story