‘చారి’.. ఈసారి?

by Shyam |
‘చారి’.. ఈసారి?
X

దిశ, ఆదిలాబాద్: కేంద్ర మాజీమంత్రి, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డ డాక్టర్ ఎస్.వేణుగోపాలాచారికి రాజ్యసభ సీటు దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటినుంచి సీఎం కేసీఆర్‌తో సన్నిహితంగా మెలిగిన వేణుగోపాలాచారి ఉమ్మడి ఆదిలాబాద్ రాజకీయాల్లో కీలకనేతగా ఎదిగారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటం కూడా ఆయనకు కలిసొచ్చే అంశం. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంతో సంబంధాలను మెరుగుపరుచుకునే ఆలోచనలో ఉన్న కేసీఆర్ అందుకు వేణుగోపాలాచారి సరైన వ్యక్తి అని భావిస్తున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పార్టీపరంగానూ ఒక సీనియర్ నేత ఢిల్లీలో కీలక బాధ్యతల్లో ఉంటేనే మంచిదనే అభిప్రాయానికి కేసీఆర్ వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం కేంద్రంలో వివిధ కీలక శాఖలకు మంత్రులుగా ఉన్నవారితోనూ చారికి గల సన్నిహిత సంబంధాల దృష్ట్యా ఆయనను ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమించిన సంగతి తెలిసిందే. ఆరేళ్లుగా చారి ఆ పదవిలోనే కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో తెలంగాణ నుంచి రెండు సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో వేణుగోపాలాచారి పేరు తెరమీదకు వచ్చింది. అయితే ఆయన సామాజిక వర్గానికే చెందిన కెప్టెన్ లక్ష్మీకాంతారావు ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతుండటం వేణుగోపాలా చారికి ప్రతికూలంగా కనిపిస్తున్నా మిగతా విషయాలన్నీ కలిసి వస్తాయన్న అభిప్రాయంతో చారి ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెప్పుకుండటం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed