Punjab: పంజాబ్‌లో 11 మందిని హత్య చేసిన 'సీరియల్ కిల్లర్' అరెస్ట్

by S Gopi |
Punjab: పంజాబ్‌లో 11 మందిని హత్య చేసిన సీరియల్ కిల్లర్ అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్‌లో హత్యలు చేస్తూ పోలీసులకు దొరక్కుండా తిరుగుతున్న ఓ సీరియల్ కిల్లర్ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. అయితే, ఓ హత్య కేసులో విచారణ సందర్భంగా అతను సీరియల్ కిల్లర్ అని తెలిసీ పోలీసులు ఆశ్చర్యపోయారు. పంజాబ్‌లోని హోషియాపూర్ జిల్లా గర్హశంకర్ చౌరా గ్రామానికి చెందిన రామ్ సరూప్ అలియాస్ సోధీ గత 18 నెలల్లో 11 మందిని చంపినట్టు పోలీసు అధికారులు మంగళవారం ప్రకటనలో తెలిపారు. అంతకుముందు రోజు ఓ కేసు విషయమై అతడిని అరెస్ట్ చేశామని, విచారణలో అతను సీరియల్ కిల్లర్ తేలిందని వారు చెప్పారు. బాధితులను కారులో లిఫ్ట్ ఇచ్చే నెపంతో ఎక్కించుకుని, ఆపై వారిని దోచుకుని, ప్రతిఘటిస్తే చంపేవాడని వివరించారు. జిల్లాలో క్రూరమైన నేరాల కేసులను ఛేదించేందుకు రూపనగర్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ గుల్‌నీత్‌ సింగ్‌ ఖురానా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హత్య కేసుల్లో ప్రమేయం ఉన్న నిందితులను పట్టుకునేందుకు పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే కిరాత్‌పూర్ సాహిబ్‌లో జరిగిన ఒక హత్య కేసును దర్యాప్తు చేస్తుండగా, టోల్ ప్లాజా మోడ్రా వద్ద టీ, నీరు అందించే వ్యక్తిని సోధీ ఆగస్టు 18న హత్య చేసినట్లు తేలింది. ఈ కేసు దర్యాప్తులో రామ్ సరూప్‌ను అరెస్టు చేశామని, ఆ తర్వాత ఇతర కేసుల్లో అతడి ప్రమేయం ఉన్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుతో పాటు మరో 10 హత్యలు చేసినట్లు నిందితుడు అంగీకరించాడని అధికారులు స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed