WHO: డబ్ల్యూహెచ్‌వో నుంచి తప్పుకోనున్న యూఎస్? ట్రంప్ ప్రమాణం చేసిన వెంటనే ప్రకటించే చాన్స్

by vinod kumar |
WHO: డబ్ల్యూహెచ్‌వో నుంచి తప్పుకోనున్న యూఎస్? ట్రంప్ ప్రమాణం చేసిన వెంటనే ప్రకటించే చాన్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వచ్చే ఏడాది జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక పలు సంచలన నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి అమెరికా వైదొలగనున్నట్టు పలు కథనాలు పేర్కొంటున్నాయి. దీని కోసం ట్రంప్ కార్యవర్గం సిద్ధమవుతున్నట్టు సమాచారం. ట్రంప్ ప్రమాణం చేసిన మొదటి రోజునే ఈ నిర్ణయం ప్రకటించే చాన్స్ ఉందని తెలుస్తోంది. వాషింగ్టన్‌లోని జార్జ్‌టౌన్ యూనివర్శిటీకి చెందిన గ్లోబల్ హెల్త్ ప్రొఫెసర్ లారెన్స్ గోస్టిన్ ఈ అంశంపై స్పందిస్తూ.. డొనాల్డ్ ట్రంప్ తన రెండో టర్మ్ మొదటి రోజు లేదా మరికొన్ని రోజుల్లో డబ్లూహెచ్ఓ నుంచి వైదొలగే అవకాశం ఉందని తెలిపారు.

అయితే ఈ కథనాలపై ట్రంప్ బృందం అధికారింగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ డబ్లూహెచ్ ఓ నుంచి అమెరికా వైదొలగితే ప్రపంచ ఆరోగ్య విధానాల్లో భారీ మార్పులు సంభవిస్తాయని పలువురు భావిస్తు్న్నారు. కాగా, కొవిడ్ మహమ్మారి సమయంలో చైనాను జవాబుదారీగా ఉంచడంలో డబ్లూహెచ్ఓ విఫలమైందని ట్రంప్ పదే పదే ఆరోపిస్తున్నారు. డబ్లూహెచ్ఓ డ్రాగన్ కు కీలు బొమ్మగా మారిందని విమర్శించారు. దీంతో అమెరికా ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ మొదటగా తీసుకునే నిర్ణయం డబ్లూహెచ్ఓ నుంచి బయటకురావడమేననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed